చీకటి వ్యాపారంలో మునిగి తేలుతున్న డాక్టర్ల అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో స్కానింగ్ మాఫియాతో డాక్టర్లు చేతులు కలిపారు. ల్యాబ్, స్కానింగ్, ఎక్స్‌రేలను ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లకు రాసి.. సీల్డ్ కవర్లో డబ్బులు తీసుకొంటున్నారు. లక్షల్లో ప్రభుత్వ సొమ్మును జీతాల రూపంలో తీసుకుంటున్న మదనపల్లె డాక్టర్లకు ఇది ఓ వ్యసనంగా మారింది. రోగులకు వైద్యం చేయాల్సింది మరచి.. అదే రోగులతోనే మూడు పువ్వలు ఆరు కాయలుగా డాక్టర్ల వ్యాపారం కొనసాగుతోంది.
మదనపల్లె జిల్లా అస్పత్రిలో అందరూ స్థానిక డాక్టర్లే. ఇష్టం వచ్చినప్పుడు అస్పత్రి వస్తారు, కాలక్షేపం చేసి జారుకుంటారు. డాక్టర్ల పని తీరును ప్రశ్నించి అడిగే వారు లేక ఇస్టారాజ్యంగా వ్యవరిస్తూ వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఎక్స్‌రే, ల్యాబ్ టెస్టులు ఉన్నా .. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌లకు పంపుతున్నారు. ప్రసూతి కేసుల ల్యాబ్ టెస్టులన్నీ ప్రైవేటు క్లినిక్ లకు రిఫర్ చేస్తున్నారు. దాంతో ఒక్కో డాక్టర్ రోజువారి సీల్డ్ కవర్ వ్యాపారం 10 వేల రూపాయలుగా ఉంది. కార్పొరేట్ హాస్పిటల్ తలపించేలా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద రోగుల జేబులకు చిల్లు పెట్టుకొంటున్న దారుణ పరిస్థితి ఏర్పడింది. జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో మదనపల్లిలో ప్రభుత్వ వైద్యం దైవ దీనంగా మారింది. జిల్లా కలెక్టర్ పట్టించుకుంటే మరిన్ని కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని జనాలు అంటున్నారు.