Online Game: లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ ప్రాంతంలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. బీఐపీఎస్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న యష్ కుమార్(12) అనే బాలుడు ఆన్‌లైన్ గేమ్‌లో భారీ మొత్తాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. యష్ తండ్రి సురేష్ కుమార్ యాదవ్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతను రెండు సంవత్సరాల క్రితం తన భూమిని అమ్మి యూనియన్ బ్యాంక్ బిజ్నోర్ బ్రాంచ్‌లో రూ.13 లక్షలు డిపాజిట్ చేశాడు. సోమవారం, సురేష్ తన పాస్‌బుక్‌ను అప్‌డేట్ చేశాడు. ఖాతాలోని రూ. 13 లక్షలు ఖాళీ అయినట్లు తెలుసుకుని షాక్ అయ్యాడు. దర్యాప్తు చేపట్టగా.. ఆన్‌లైన్ గేమింగ్ లావాదేవీల ద్వారా డబ్బు ఖర్చు చేసినట్లు తేలింది.
READ MORE: Uttar pradesh: నెట్టింట్లో బీజేపీ జిల్లా ఉపాధ్యాక్షుడి అసభ్యకర వీడియో..
దీంతో ఇంటికి తిరిగి వచ్చిన సురేష్ తన కొడుకు యష్‌ను దీని గురించి అడిగాడు. ఫ్రీ ఫైర్ ఆడుతూ.. రూ. 13 లక్షలను డబ్బును కోల్పోయానని యష్ ఒప్పుకున్నాడు. అయినప్పటికీ.. తండ్రి తన కొడుకును తిట్టలేదు. బదులుగా అతనికి కౌన్సెలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఇది తప్పని బాలుడికి వివరించాడు. కానీ ఈ ఘటన తర్వాత మనస్తాపానికి గురైన యష్ తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే యష్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. యష్ తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. కొడుకు మరణ వార్త విని తల్లి విమల స్పృహ కోల్పోయింది. కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
