Site icon NTV Telugu

IPL 2025: అలాంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవద్దు!

Mohammad Kaif

Mohammad Kaif

గాయాల పాలయ్యే అవకాశం ఉన్న ఆటగాళ్లను భారీ మొత్తాలు వెచ్చించి రిటైన్‌ చేసుకోకూడదని ఫ్రాంఛైజీలకు టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్‌ కైఫ్‌ సూచించాడు. ఆటగాళ్లకు గాయాలు కావని తాను చెప్పడం లేదని, కానీ ఎక్కువగా గాయాలపాలయ్యే అవకాశమున్న ఆటగాళ్లను మాత్రం పెద్ద మొత్తం వెచ్చించి రిటైన్‌ చేసుకోకూడదని తన అభిప్రాయాన్ని చెప్పాడు. సీజన్‌ మొత్తం ఆడే ఆటగాళ్ల కోసం డబ్బు వెచ్చించడానికి తాను మొగ్గు చూపుతాను అని కైఫ్‌ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓడిపోయింది. ఈ పరాజయంతో లక్నో ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఆటగాళ్ల గాయాలే తమ టీమ్‌ ప్లేఆఫ్స్‌ చేరుకోలేదని కెప్టెన్ రిషభ్‌ పంత్‌ మ్యాచ్‌ అనంతరం అన్నాడు. మయాంక్‌ యాదవ్‌, మోసిన్‌ ఖాన్‌ లాంటి టాప్ బౌలర్లు అందుబాటులో లేకపోవడం వల్లనే లక్నో ఓటములకు కారణం అని చెప్పుకొచ్చాడు. పంత్‌ వ్యాఖ్యలపై మహమ్మద్‌ కైఫ్‌ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని చెప్పాడు.

‘నేను సీజన్‌ మొత్తం ఆడే ప్లేయర్స్ కోసం డబ్బు వెచ్చించడానికి మొగ్గు చూపుతా. లక్నో బౌలర్లు అందరూ గాయాలతో సతమతమవుతున్నారు. ఆటగాళ్లకు గాయాలు కావని నేను చెప్పడం లేదు కానీ.. ఎక్కువగా గాయాల పాలయ్యే అవకాశమున్న ఆటగాళ్లను భారీ మొత్తం వెచ్చించి రిటైన్‌ చేసుకోకూడదు. వారికి వేలంలో తీసుకుంటేనే బాగుంటుంది’ అని మహమ్మద్‌ కైఫ్‌ సూచించాడు. ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడిన లక్నో 5 విజయాలు మాత్రమే సాధించింది.

Exit mobile version