IPL 2027: ఈ సారి ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి లక్నో సూపర్‌ జెయింట్స్.. ఎవరూ ఊహించని కెప్టెన్..

Lsg

Lsg

ఐపీఎల్ 2027 సీజన్ కోసం లక్నో సూపర్‌ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) జట్టు నూతన నాయకుడి అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. 2025, 2026 సీజన్లలో ఎల్‌ఎస్‌జీకి నాయకత్వం వహించిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్, జట్టు వరుస వైఫల్యాల కారణంగా విడిపోయి తిరిగి తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) వైపు మొగ్గు చూపాడు. దీంతో ఎల్‌ఎస్‌జీ తదుపరి కెప్టెన్ రేసులో దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. మార్క్రమ్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్’ టోర్నీలో ఎల్‌ఎస్‌జీ సిస్టర్ ఫ్రాంచైజీ, మాంచెస్టర్ సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ విజయవంతంగా నడిపిస్తున్నాడు.

అయితే, ఎల్‌ఎస్‌జీ కప్టెన్సీపై తాను పెద్దగా ఆలోచించడం లేదని మార్క్రమ్ స్పష్టం చేశాడు. జట్టు యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకుంటుందని, లక్నో జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన నాయకులు ఉన్నారని పేర్కొన్నాడు. ఎవరు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినా జట్టును ఉత్తమంగా నడిపిస్తారనే నమ్మకం తనకు ఉందన్నాడు. మార్క్రమ్‌తో పాటు ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్ కూడా ఎల్‌ఎస్‌జీ నాయకత్వ రేసులో ఉన్నారు. లేదా రాబోయే మినీ వేలంలో కొత్త ఆటగాడిని కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించే ఆలోచనలో కూడా యాజమాన్యం ఉండవచ్చని తెలుస్తోంది.

మరోవైపు.. 100 బంతుల ఫార్మాట్‌లో కెప్టెన్సీ చేయడం కొత్త సవాళ్లతో కూడుకున్నప్పటికీ చాలా ఆసక్తికరంగా ఉందని మార్క్రమ్ వివరించాడు. జోస్ బట్లర్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల సలహాలు తనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పాడు. ఒకే వైపు నుంచి వరుసగా 10 బంతులు వేయించే నిబంధన ఈ ఫార్మాట్‌లో బౌలింగ్ వ్యూహాలను వేగంగా మార్చుకునేలా చేస్తుందని, లీగ్ పోటీ తత్వం తనను విశేషంగా ఆకట్టుకుందని అభిప్రాయపడ్డాడు.