NTV Telugu Site icon

Rishabh Pant: వేలంలో పంజాబ్ తీసుకుంటుందేమోనని టెన్షన్‌ పడ్డా: పంత్

Rishabh Pant

Rishabh Pant

లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌గా టీమిండియా వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ నియమితుడయ్యాడు. ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో రూ.27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను దక్కించుకున్న లక్నో.. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గొయెంకా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ వేలంలోకి వదిలేసిన సంగతి తెలిసిందే. సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పంత్ మాట్లాడుతూ.. వేలంలో పంజాబ్ కింగ్స్ ప్రాంచైజీ తీసుకుంటుందేమోనని టెన్షన్‌ పడ్డా అని సరదాగా అన్నారు.

‘వేలం రోజు నేను కాస్త టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్‌కు కారణం పంజాబ్ కింగ్స్‌. పంజాబ్ వద్ద అత్యధిక పర్సు మనీ ఉంది. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్‌ దక్కించుకోవడంతో నేను లక్నో టీమ్‌లో చేరగలనని అనుకున్నాను. లక్నోలో చేరేందుకు అవకాశం ఉంది కానీ.. చివరికి వేలంలో ఏం జరుగుతుందో తెలీదు కదా. దీంతో కాస్త టెన్షన్ పడ్డాను. భారీ ధర దక్కించున్నందుకు ఒత్తిడి ఏమీ లేదు. సంజీవ్ గోయెంకా ఆందోళన చెందనంత కాలం నాకు ఎలాంటి సమస్య లేదు. డబ్బు సంపాదించడం మంచిదే కానీ.. ప్రతి రోజు దాని గురించే ఆలోచించకూడదు’ అని రిషబ్‌ పంత్‌ తెలిపాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్‌, పంజాబ్‌ కింగ్స్‌లో ఒక జట్టు రిహాబ్ పంత్‌ను దక్కించుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. పంజాబ్‌ వద్ద అత్యధిక పర్స్‌ మనీ ఉండటం, రికీ పాంటింగ్‌ కోచ్‌గా వెళ్లడంతో పంత్‌ను కచ్చితంగా తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ వేలంలో పంజాబ్‌ రూ.26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్‌ను కైవసం చేసుకుంది. కాసేపటికే పంత్‌ను లక్నో రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది.