LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..

  • LPUలో విద్యార్థుల ఆందోళన హింసాత్మకం
  • విద్యార్థులు, పంజాబ్ పోలీసుల మధ్య ఘర్షణ
  • పలువురు పోలీసులకు గాయాలైనట్లు ఎస్ఎస్పీ వెల్లడి
  • విద్యార్థినిపై అత్యాచారం ఆరోపణలతో అట్టుడుకుతున్న వర్సిటీ
Lpu (2)

Lpu (2)

LPU Students Protest: పంజాబ్‌లోని ఫగ్వారా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఒక విద్యార్థినిపై యూనివర్సిటీ బయట వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా నిరసన చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. యూనివర్సిటీలోని కిటీల అద్దాలు పగలగొట్టడంతో పాటు కొన్ని వస్తువులకు నిప్పుపెట్టారు. ఆదివారం సాయంత్రం కూడా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ ఘర్షణలు విద్యార్థులు, పోలీసులకు మధ్య ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయని జలంధర్ ఎస్ఎస్పీ హర్విందర్ సింగ్ విర్క్ తెలిపారు. పలు పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయని, కొన్నింటికి నిప్పు పెట్టారని తెలుస్తోంది.

ఈ ఉద్రిక్తతలు శనివారం రాత్రి నుంచే నెమ్మదిగా మొదలయ్యాయి. క్యాంపస్‌లో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందని, అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందంటూ సోషల్ మీడియాలో సమాచారం వ్యాపించింది. ఈ వార్తలతో భారీ సంఖ్యలో విద్యార్థులు బాలికల హాస్టల్ సమీపంలో గుమిగూడారు. ఈ ఘటనపై ఎలాంటి ఆధారాలు, ఫిర్యాదులు అందలేదని ముందుగా పోలీసులు చెప్పారు. యూనివర్సిటీ వర్గాలు కూడా ఈ ఘటనను తోసిపుచ్చాయి.

ఇదిలా ఉంటే, ఆ తర్వాత పోలీసులు విద్యార్థిని వాంగ్మూలం తీసుకుని, కేసు నమోదు చేశారు. ఘటనపై సిట్ ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ ఆధారాలు, CCTV ఫుటేజ్, ఫోన్ డేటాను పరిశీలించనున్నట్లు జలంధర్ రేంజ్ డీఐజీ నవీన్ సింగ్లా తెలిపారు. ఈ దర్యాప్తులో విద్యార్థి ప్రతినిధుల్ని కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు.