ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా మారింది. 193 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 58 పరుగులకే 4 వికెట్స్ కోల్పోయింది. యశస్వి జైస్వాల్ (0), కరుణ్ నాయర్ (14), శుభ్‌మన్ గిల్ (6), ఆకాశ్ దీప్ (1) ఇప్పటికే పెవిలియన్ చేరారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (33; 47 బంతుల్లో 6×4) పోరాడుతున్నాడు. చివరి రోజు భారత్ విజయానికి 135 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లండ్ ఆరు వికెట్లు తీయాల్సి ఉంది.
లార్డ్స్ టెస్ట్ రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఇంగ్లండ్ సహాయక కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తొలి గంటలోనే ఆరు వికెట్లు తీస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘పిచ్ నుంచి బౌన్స్ ఎక్కువగా వస్తోంది. పెవిలియన్ ఎండ్ కంటే నర్సరీ ఎండ్ నుంచి బౌలర్లకు అదనంగా సాయం లభిస్తోంది. చివరి రోజు ఉదయం కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాము. స్టంప్స్ లక్ష్యంగా బంతులు వేస్తాం. తొలి గంటలోనే భారత్ ఆరు వికెట్లు తీయాలని మా బౌలర్లకు చెప్పా. మా బౌలర్లపై నమ్మకం ఉంది. మొదటి గంటలోనే ఆరు వికెట్స్ తీసే అవకాశాలు లేకపోలేదు’ అని ట్రెస్కోథిక్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: Road Accident: అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 9కి చేరిన మృతుల సంఖ్య!
‘నాలుగో రోజు ఆట చివరలో భారత్ స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. దాంతో బౌలర్ల ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. ఈరోజు మొదటి గంటలో టీమిండియా బ్యాటర్లు ఎలా ఆడతారు?, మా బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. మేం ఆరంభంలోనే వికెట్లు తీస్తే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. వికెట్స్ తీయడానికే ప్రయత్నిస్తాం’ అని మార్కస్ ట్రెస్కోథిక్ చెప్పాడు. బ్యాటర్లు రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి.. ఆల్‌రౌండర్‌లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. చివరలో బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఆడతారు. లోకేష్ రాహుల్ అండగా పంత్, నితీశ్ కాసేపు క్రీజులో నిలబడితే మ్యాచ్ టీమిండియా వశం అవ్వడం పక్కా.
