NTV Telugu Site icon

Lok sabha speaker: లోక్‌సభ స్పీకర్‌ రేసులో ఏపీ, ఒడిశా నేతలు!

Speaj

Speaj

ఈనెల 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే ఈ పోస్టు కోసం ఎన్డీఏ కూటమిలో పోటీ నెలకొంది. స్పీకర్ పోస్టు సొంతం చేసుకోవాలని ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన జేడీయూ, తెలుగు దేశం పార్టీలు భావిస్తున్నాయి. కానీ కీలకమైన ఆ పోస్టు బీజేపీ వదులుపెట్టుకోకూడదని భావిస్తోంది. దీని కోసం కమలనాథులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పోస్టు ఎంపిక కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా నేతలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఒడిశాకు చెందిన భర్తృహరి మహతాబ్, ఏపీకి చెందిన రాజమండ్రి బీజేపీ ఎంపీ పురందేశ్వరి పేరును బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పురందేశ్వరి.. టీడీపీకి దగ్గర మనిషి కావడం. పైగా పురందేశ్వరి బీజేపీ ఎంపీ కావడంతో ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఇటీవలే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఒడిశాలో బీజేడీ నుంచి బీజేపీలో చేరిన భర్తృహరి మహతాబ్ పేరును కూడా పరిశీలిస్తు్న్నట్లు సమాచారం. ఇతను డిబేట్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 2017, 2018, 2019, 2020 సంసద్ రత్న అవార్డును కూడా అందుకున్నారు. ఒడిశాలోని కటక్ నియోజకవర్గం నుంచి 1998లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 1999, 2009, 2014, 2019లో తిరిగి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక 2017లో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డును కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈయన పేరును కూడా కాషాయ పార్టీ నేతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సారి లోక్‌సభ స్పీకర్ పోస్టును ఒడిశా లేదా ఏపీకి ఇవ్వాలని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకుంది.

ఇక పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. జూన్ 26న ప్రధాని నరేంద్ర మోడీ స్పీకర్ పేరుపై తీర్మానాన్ని ప్రవేశపెడతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తీర్మానం ఆమోదించబడిన తర్వాత సభకు పరిచయం చేస్తారు. ఇదిలా ఉంటే ఇండియా కూటమి కూడా స్పీకర్ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగిగే స్పీకర్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రభుత్వం అంగీకరించకుంటే స్పీకర్‌ అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేస్తున్నాయి.

పురందేశ్వరి 2004లో బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం 2009లో విశాఖ నుంచి రెండోసారి విజయం సాధించి.. యూపీఏ హయాంలో హన్మోహన్ సింగ్ కేబినెట్‌లో వాణిజ్యం, పరిశ్రమల, మానవ మనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి 2014లో బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ ఒడిశా రాష్ట్ర ఇంఛార్జ్‌గా.. అటు తర్వాత 2023, జూలై 4న ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే జూన్ 24న 18వ పార్లమెంటు సమావేశాల్లో స్పీకర్‌ను నియమించే వరకు కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేరళలోని మావెలికరాకు చెందిన 68 ఏళ్ల ఎంపీ అత్యధిక కాలం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంటు సమావేశానికి ముందు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రధాని మంత్రి, కేంద్ర కేబినెట్, ఇతర ఎంపీలతో ఆయన ప్రమాణం చేయిస్తారు.