Site icon NTV Telugu

Lok Sabha Elections 2024: నేటితో ప్రచారానికి తెర.. జోరు పెంచిన ప్రధాన పార్టీలు

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగియనుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ సోమవారం అంటే మే 13న జరగనుంది. నాలుగో దశలో 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ అన్ని స్థానాల్లో ప్రచారానికి నేడు చివరి రోజు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి నాలుగో విడత ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత అభ్యర్థులు తమకు అనుకూలంగా ప్రచారం చేయలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అభ్యర్థులందరూ ముమ్మరంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నించనున్నారు.

Read Also: AP Elections 2024: ఏపీలో నేటితో ప్రచారానికి తెర..

నాలుగో దశలో మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగో దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూ కశ్మీర్‌.. ఈ 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో అత్యధికంగా తెలంగాణ నుంచి 525 మంది అభ్యర్థులు 17 ఎంపీ స్థానాల బరిలో నిలిచారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక బీహార్‌లోని 5 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 55 మంది పోటీలో నిలిచారు. జమ్మూకాశ్మీర్లో ఒక్క పార్లమెంటు స్థానానికి 24 మంది పోటీపడుతున్నారు. ఝార్ఖండ్‌లోని 4 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 45 మంది పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని 8 పార్లమెంటు స్థానాలకు గానూ 74 మంది పోటీపడుతున్నారు. అటు మహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుండగా 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒడిశాలో 4 పార్లమెంట్ స్థానాలకు 37 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 130 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాల్లో 75 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

Read Also: Arvind Kejriwal: నేటి నుంచి కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం.. పాల్గొననున్న పంజాబ్ సీఎం..

నాలుగో దశలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇద్దరు క్రికెటర్లు, ఒక నటుడు సహా 1717 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికలు ఫలితాలు జూన్‌ 4న రానున్నాయి. మొత్తం 96 స్థానాలకు 4264 నామినేషన్లు రాగా.. స్క్రుటినీ తర్వాత ఆ సంఖ్య 1970కు చేరుకుంది. ఇక ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం మొత్తం 1717 మంది మే 13న జరగనున్న పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Exit mobile version