Site icon NTV Telugu

LK Advani: ఐసీయూలో అద్వానీ.. డాక్టర్లు ఏమన్నారంటే?

Lk Advani

Lk Advani

దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇంద్రప్రస్థ అపోలోలో చేర్పించారు. ఇంద్రప్రస్థ అపోలో శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఎల్‌కె అద్వానీని వైద్య నిర్వహణ, పరీక్షల కోసం ఐసీయూలో చేర్చారు. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి సంరక్షణలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది. అయితే అద్వానీని ఐసీయూలో ఎందుకు చేర్చాల్సి వచ్చిందో ఆస్పత్రి వర్గాలు వెల్లడించలేదు. ఆయన వయసు 97 ఏళ్లు. ఈ ఏడాది ఆగస్టు నెలలో కూడా ఆయన అపోలో చేరారు. ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్ చేశారు.

READ MORE: Group-2 Exams: ప్రారంభమైన గ్రూప్-2 తొలి రోజు తొలి పరీక్ష..

మూడు సార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అద్వానీ..
లాల్ కృష్ణ అద్వానీ నవంబర్ 8, 1927 న కరాచీలో (ఇది ప్రస్తుత పాకిస్థాన్‌లో ఉంది) జన్మించారు. నవంబర్ 8న తన 97వ పుట్టినరోజు జరుపుకున్నారు. అద్వానీ 1942లో ఆర్‌ఎస్‌ఎస్‌లో వాలంటీర్‌గా చేరారు. 1986 నుంచి 1990 వరకు, మళ్లీ 1993 నుంచి 1998 వరకు, 2004 నుంచి 2005 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి (ఏప్రిల్ 6, 1980) అత్యధిక కాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు అద్వానీ. 1999 నుంచి 2005 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో హోం మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు.

READ MORE:Weather Today: తెలంగాణలో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు..

Exit mobile version