Site icon NTV Telugu

Nirmala Sitharaman: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులతో కేంద్రమంత్రి ఇష్టాగోష్టి

Nira

Nira

సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సడన్‌గా తెలుగు రాష్ట్రాల విద్యార్థుల దగ్గర ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవన్‌ దగ్గరకు వచ్చారు. క్యాంటిన్‌లో మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తుండగా విద్యార్థులతో ముచ్చటించారు. అనేక అంశాలపై వారితో చర్చించారు. హఠాత్తుగా కేంద్రమంత్రి ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను నిర్మలా సీతారామన్ తన ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టుచేశారు.

 

శనివారం ఢిల్లీలోని ఆంధ్ర, తెలంగాణ భవన్ క్యాంటీన్‌లో మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇంటరాక్షన్ అయ్యారు. ఆయా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులతో సంభాషించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ద్వారా సెంట్రల్ సివిల్ సర్వీసెస్‌లో చేరాలని కోరుకునే వారితో చర్చలు జరిపారు. అలాగే కళాశాల విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు భోజనం చేస్తుండగానే వారితో సంభాషించారు.

ప్రధానంగా వారితో దేశ ఆర్థిక వ్యవస్థ గురించి.. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ భారతదేశానికి ఎలా ఉపయోగపడుతుంది. జీ 20కి భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం, ఇతర విషయాలు గురించి ఆమె ముచ్చటించారు. అలాగే భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడంపై కూడా చర్చించారు. ఇన్‌ఫ్రా, ఫారెక్స్, కొత్త విద్యా విధానం, రాజకీయాల్లోకి ప్రవేశించడం, ప్రైవేటీకరణ, ఉపాధి అంశాలపై చర్చించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారసత్వం, సంపద పన్ను వంటి అంశాలు విపక్షాలు లేవనెత్తుతున్నాయని ఆర్థిక మంత్రి కార్యాలయం ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు భవన్‌లను సందర్శించిన నిర్మలా సీతారామన్.. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 

Exit mobile version