Site icon NTV Telugu

Inga Ruzeniene: ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యూరప్ దేశం.. కొత్త ప్రధానికి 44 ఏళ్లు..

01

01

Inga Ruzeniene: ఓ యూరప్ దేశం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఈ దేశంలో తాజాగా కొత్త ప్రధాన మంత్రి ఎన్నిక జరిగింది. ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం.. యూరప్‌లో 44 దేశాలు ఉన్నాయి. వీటిలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ వంటి పెద్ద దేశాలు ఎక్కువ మందికి తెలుసు. కానీ యూరప్‌లోని లిథువేనియా అనే చిన్న దేశం తాజాగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ దేశానికి యూరోపియన్ యూనియన్, NATO లో సభ్యత్వం ఉంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ దేశం రష్యా సరిహద్దులకు ఆనుకొని ఉంది. తాజాగా ఈ దేశం కొత్త ప్రధానమంత్రి ఎన్నికతో వార్తల్లో నిలిచింది.

READ ALSO: Thalapathy Vijay: విజయ్‌పై మాన్ హ్యాండ్లింగ్ కేసు

కొత్త ప్రధానిగా ఇంగా రుజెనియెన్‌..
లిథువేనియా పార్లమెంట్ 44 ఏళ్ల ఇంగా రుజెనియెన్‌ను దేశ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఇంగా వృత్తిరీత్యా ట్రేడ్ యూనియన్ నాయకురాలు. తన వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులు, మీడియా నివేదికల తరువాత దేశ మాజీ ప్రధానమంత్రి గింటౌటాస్ పలుకాస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రధాన మంత్రి పదవికి ఇంగా రుజెనియెన్ పేరును ప్రతిపాదించింది. ఈక్రమంలో పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో ఆమెకు అనుకూలంగా 78 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 35 మంది ఎంపీలు ఓటు వేశారు. ఇంగా రుజెనియెన్ 2023 సార్వత్రిక ఎన్నికలకు ముందు సెంటర్-లెఫ్ట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. అప్పుడు పార్టీ హైకమాండ్ ఆమెకు సామాజిక భద్రత కార్మిక మంత్రిగా అవకాశం కల్పించింది. ఆమె రాజకీయాల్లో రాకముందు లిథువేనియా ట్రేడ్ యూనియన్ల సమాఖ్య అధ్యక్షురాలిగా ఉన్నారు. అలాగే యూరోపియన్ కార్మిక సంస్థలలో కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.

కొత్త సవాళ్లతో స్వాగతం..
సోషల్ డెమోక్రటిక్ పార్టీ సోమవారం మరో రెండు పార్టీలతో కలిసి కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సంకీర్ణ ప్రభుత్వానికి పార్లమెంట్ (సీమాస్)లోని 141 ఎంపీల్లో 82 మంది ఎంపీల మద్దతు ఉంది. ఇప్పుడు కొత్త ప్రధానమంత్రి ముందున్న అతిపెద్ద సవాలు ప్రభుత్వాన్ని స్థిరత్వం వైపు నడిపించడం, ఓటర్ల అంచనాలను అందుకోవడం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తానని ఇంగా పేర్కొన్నారు. ఆమెకు రాజకీయాలతో పాటు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమని చెప్పారు. ముఖ్యంగా డిటెక్టివ్, మిస్టరీ-థ్రిల్లర్ పుస్తకాలు ఇష్టంతో చదువుతానని, తనకు ఇష్టమైన పుస్తకాలలో ది లిటిల్ ప్రిన్స్ ఒకటని పేర్కొన్నారు. వీటితో పాటు ప్రయాణాలకు, పెయింటింగ్‌కు కూడా తను సమయం కేటాయిస్తానని చెప్పారు. తన బిజీ లైఫ్ నుంచి ఇవి కాస్త ఉపశమనం కలిగిస్తాయని వెల్లడించారు.

రష్యాకు – ఉక్రెయిన్‌తో సంబంధం..
1981 మే 24న ఇంగా ట్రాకాయిలో జన్మించింది. ఆమె బాల్యంలో ఎక్కువ భాగం దేశ రాజధాని విల్నియస్‌లో గడిపింది. ఆమె తన వేసవి సెలవుల్లో ఎక్కువగా తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్ నగరానికి వెళ్లేది. ఎందుకంటే అక్కడ ఆమె బంధువులు నివసించేవారని, అందుకే తన జీవిత మూలాలు లిథువేనియా, ఉక్రెయిన్, రష్యా ఈ మూడు ప్రదేశాలతో అనుసంధానించబడి ఉన్నాయని అంటారు. ఈక్రమంలో ఆమె మాస్కో-కీవ్ యుద్ధంలో రష్యా దూకుడు విధానాలను విమర్శిస్తూ.. ఉక్రెయిన్‌కు మద్దతుగా తన స్వరాన్ని వినిపించింది.

READ ALSO: Kanyakumari Review: కన్యాకుమారి రివ్యూ

Exit mobile version