NTV Telugu Site icon

Benjamin Netanyahu: హమాస్ ఉగ్రవాదం అంతమయ్యే వరకు నిద్రపోం

Benjamin Netanyahu

Benjamin Netanyahu

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు హమాస్‌ మిలిటెంట్లను రాక్షసులతో పోల్చారు. సోమవారం ఆయన హమాస్‌ దాడిలో అక్టోబరు 7న మృతి చెందిన ఇజ్రాయెలీల స్మారకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము హమాస్‌ చెరలోని బందీలను ఒక్క సెకను కూడా మరిచిపోమన్నారు. బందీలందరినీ ఇంటికి తెస్తామని స్పష్టం చేశారు. వారి ఉగ్రవాదం అంతమయ్యేవరకు నిద్రపోమని తెలిపారు. వాళ్లో.. మేమో తేల్చుకుంటామని హెచ్చరించారు. అక్టోబరు 7 దాడిలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ నిర్మూలిస్తామన్నారు. మళ్లీ ఆయుధాలు పట్టకుండా వారి చేతులను నరికేస్తామని చెప్పారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు బెంజమిన్.

READ MORE: HD Revanna: కిడ్నాప్ కేసులో హెచ్‌డీ రేవణ్ణకు ఊరట.. బెయిల్ మంజూర్

ఇదిలా ఉండగా.. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడులకు ఇప్పుడు జబాలియా కేంద్రంగా మారింది. ఉత్తర గాజాలోని ఈ ప్రాంతంపై టెల్‌ అవీవ్‌ గగనతల దాడులు చేస్తోంది. యుద్ధం ఆరంభంలో జబాలియాపై ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు (ఐడీఎఫ్‌) పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డాయి. హమాస్‌ మిలిటెంట్లను ఏరిపారేశాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఆ ప్రాంతంలో హమాస్‌ జోరు క్రమంగా పెరుగుతోంది. దీంతో ఐడీఎఫ్‌ రఫాతో పాటు.. జబాలియాపైనా దృష్టి సారించింది. రఫాలో పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా.. ఇజ్రాయెల్ హమాస్‌ని పూర్తిగా తుడచిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గాజా, ఈజిప్టు సరిహద్దుల్లో దక్షిణాన ఉన్న రఫాను ఆక్రమించింది. ఆ ప్రాంతంలోని ప్రజల్ని ఇప్పటికే వేరే ప్రాంతాలకు తరిలివెళ్లాలని ఆదేశించింది. గాజా సిటీపై దాడులు తర్వాత హమాస్ నేతలు రఫాలో తలదాచుకున్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే, ఈ దాడులపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఇజ్రాయెల్ వినడం లేదు. ఇటీవల ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో సంధికి హమాస్ ఒప్పుకున్నా, ఇజ్రాయెల్ రఫాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న హమాస్ కార్యకర్తల్ని తుదుముట్టించేందుకు భూతల దాడులు చేస్తోంది.