NTV Telugu Site icon

Visakhapatnam: విశాఖలో చిరుత పులి చర్మం రవాణా.. పోలీసుల అదుపులో నిందితులు..

Leapord

Leapord

విశాఖపట్నం నగరంలోని నడిబొడ్డున చిరుత పులి చర్మాన్ని రవాణా చేస్తున్న కొందరు కేటుగాళ్లను పోలీస్ అధికారులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు చిరుతపులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ( DRI ) వర్గాలకు అందిన సమాచారం మేరకు మంగళవారం నాడు సాయంత్రం పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నారు. సర్క్యూట్‌ హౌస్‌ సమీపంలోని దసపల్లా హిల్స్‌ ప్రాంతంలో ఈ నలుగురు నిందుతులను గుర్తించారు. అయితే, చిరుత పులి చర్మం తరలింపులో చిక్కిన నలుగురిలో ఇద్దరిది విశాఖ కాగా, మరో ఇద్దరు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

Read Also: Tamilnadu: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు.. బీజేపీతో ఏఏంఏంకే పార్టీ దోస్తీ..!

ఇక, చిరుతపులి చర్మాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు.. ఇందులో ఎవరెవరి హస్తం ఉంది లాంటి వివరాలను నిందితుల దగ్గర నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం డీఆర్‌ఐ అధికారుల ఆధీనంలో ఉన్న స్మగ్లర్లను అటవీశాఖ అధికారులకు నిన్న (మంగళవారం) రాత్రి అప్పగించారు. దీంతో డీఎఫ్‌వో అనంత్‌ శంకర్‌, ఎఫ్‌ఆర్‌వో రామ్‌ నరేశ్‌, ఇతర అధికారులు నిన్న అర్ధరాత్రి వరకూ తమదైన శైలిలో నిందితులను విచారించారు. ఇక, ఏ అటవీ ప్రాంతం నుంచి తీసుకువచ్చారు.. చిరుతను ఎక్కడ చంపారనే వివరాలను రాబట్టినట్లు తెలిపారు. ఇక, పూర్తి స్థాయి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది.. చిరుత పులి చర్మం కొలతలు తీసుకున్నారు.. ప్రస్తుతం అటవీశాఖ అదుపులో ఉన్న స్మగ్లర్లపై కేసు నమోదు చేసి ఇవాళ (బుధవారం) కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.