NTV Telugu Site icon

Womens Reservation Bill: లోక్‌సభ ముందు మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. ప్రవేశపెట్టిన కేంద్రం

Womens Reservation Bill

Womens Reservation Bill

Womens Reservation Bill: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్ మేఘ్వాల్‌ దిగువ సభలో ప్రవేశపెట్టారు. నారీ శక్తి వందన్‌ అభియాన్‌ పేరుతో కేంద్రం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మంగళవారం లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ మాట్లాడుతూ.. ‘ఈ బిల్లు మహిళా సాధికారతకు సంబంధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 239ఏఏను సవరించడం ద్వారా 33శాతం సీట్లు మహిళలకు రిజర్వు చేయబడతాయి.” అని అన్నారు.

Also Read: Women’s Reservation Bill: 2029లో అమలులోకి మహిళా బిల్లు.. బిల్లులో ఎస్సీ/ఎస్టీ కోటా..

పార్లమెంట్ కొత్త భవనంలో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లు నిర్మాణంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దిగువ సభలో విపక్ష నేతల గందరగోళం మధ్య న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రేపటి(సెప్టెంబర్‌ 20) నుంచి ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. నూతన పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇదే కావడం గమనార్హం. ఈ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రం కొత్తగా మరో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొస్తున్నట్లు పేర్కొన్నాయి. అందువల్ల తాజా బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందాల్సి ఉంటుందని తెలిపాయి.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టంగా మారితే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. అయితే ఈ బిల్లు ఉభయసభల్లో ఆమోదం పొందినా కూడా 2027 తర్వాత రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంటోంది.