Site icon NTV Telugu

Lavanya Tripathi Birthday: లావణ్య అందం పాడుతున్న హిందోళం!

Lavanya

Lavanya

Lavanya Tripathi Birthday:  పేరుకు తగ్గ రూపం లావణ్య త్రిపాఠి సొంతం. ఆమెలోని సౌందర్యం, శరీరకాంతి ఇట్టే చూపరులను ఆకర్షిస్తాయి. తెలుగు సినిమా ‘అందాల రాక్షసి’తోనే వెండితెరపై వెలిగిన లావణ్య జనం మదిలో ఆ సినిమా టైటిల్ గానే నిలచిపోయింది. ఇప్పటికీ ‘లావణ్య’ అనగానే ‘అందాల రాక్షసి’ అనే రసికులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ యేడాది ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన లావణ్య త్వరలోనే ‘పులి-మేక’ అనే వెబ్ సిరీస్ తోనూ మురిపించనుంది.

లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి లాయర్. తల్లి టీచర్. డెహ్రాడూన్ లో లావణ్య విద్యాభ్యాసం సాగింది. ముంబయ్ లో రిషీ దయారామ్ నేషనల్ కాలేజ్ లో ఎకనామిక్స్ లో లావణ్య త్రిపాఠి డిగ్రీ పూర్తి చేశారు. ముంబయ్ లో చేరినప్పటి నుంచే లావణ్యకు ‘షో బిజ్’లో అడుగు పెట్టాలనే అభిలాష కలిగింది. అందుకు అనువుగానే అడుగులు వేసింది. భరతనాట్యంలో శిక్షణ పొందిన లావణ్య త్రిపాఠి అనువైన చోట నాట్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ముందుగా “సిఐడి, ప్యార్ కా బంధన్” వంటి టీవీ సీరియల్స్ లో లావణ్య నటించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘అందాల రాక్షసి’ చిత్రంతో లావణ్య తొలిసారి బిగ్ స్క్రీన్ కు పరిచయమయింది. తొలి చిత్రంలోనే నటిగా మంచి మార్కులు సంపాదించింది. దాంతో వరుసగా అవకాశాలు లభించాయి. “బ్రమ్మన్, మాయవాన్” అనే తమిళ చిత్రాలలో నటించింది. అయితే ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే లావణ్య తళుక్కుమంది.

Allu Arjun: అల్లు అర్జున్‌కి మరో అరుదైన గౌరవం.. జీక్యూ అవార్డ్ సొంతం

లావణ్య నటించిన “దూసుకెళ్తా, మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, లచ్చిమిదేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్, రాధ, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, ఇంటెలిజెంట్, అంతరిక్షం 9000 కెఎమ్.పి.హెచ్, అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్ డే” చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునే సంపాదించి పెట్టాయి. నాగార్జున సరసన లావణ్య నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఘనవిజయం సాధించింది. అలాగే నాని జోడీగా ఆమె నటించిన ‘భలే భలే మగాడివోయ్’ కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. లావణ్య అందచందాలు ఈ నాటికీ యువకులకు బంధాలు వేస్తూనే ఉన్నాయి. కాబట్టి, ఆమెకు అవకాశాలు లభిస్తూనే ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో లావణ్య ఏ తీరున మురిపిస్తుందో చూడాలి.

Exit mobile version