Latest Agriculture Technology at Israel.
మనసుంటే మార్గం ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వ తోడ్పాటు, ప్రజల సహకారంతో ఏ దేశమైన అద్భుతాలు చేయవచ్చు అని ఇజ్రాయిల్ నిరూపించింది. ఇజ్రాయిల్ దేశ భూభాగంలో సగానికి పైగా ఎడారి వాతావరణం వ్యవసాయానికి అనుకూలంగా ఉండదు. దీనికి తోడు సాగు నీటి కొరత. ఇరవై శాతం భూభాగం మాత్రమే సాగుకు అనుకూలం. కానీ వ్యవసాయంలో సాగు విధానంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది ఇజ్రాయిల్ దేశం. సాగుకు సంబంధించిన కొత్త కొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేసిన ఇజ్రాయిల్ వ్యవసాయం గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయిల్‌లో ఆధునిక వ్యవసాయం అభివృద్ధి 19వ శతాబ్దం చివరిలో జీయోనిస్ట్ ఉద్యమం పాలస్తీనాకు యూదుల వలసలతో మొదలైంది. 1948లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సాగులో ఉన్న మొత్తం విస్తీర్ణం నాలుగు లక్షల ఎనిమిది వేల ఎకరాల నుండి పది లక్షల డెబ్బై వేల ఎకరాలకు పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తి పదహారు రెట్లు పెరిగింది. వ్యవసాయం ముఖ్యంగా రెండు పద్ధతుల్లో సాగుతుంది. మొదటి పద్ధతి కిబడ్జ్. ఇది సామూహిక వ్యవసాయ పద్ధతి. ఒక కమ్యూనిటీ, ఊరు లేదా ప్రాంతం అంతా కలిసి తలా ఒక పని చేస్తూ సామూహికంగా పంట ఉత్పత్తి చేస్తారు. రెండవది మోషన్ పద్ధతి. కుటుంబం తన సొంత భూమిలో పంట సాగు చేయడం. ఇజ్రాయిల్ మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు 50 శాతంజ 2014లో పండ్లు, కూరగాయలు, ఉత్పత్తులు విలువ 3 బిలియన్ డాలర్లు.
మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల విలువ 8 బిలియన్ డాలర్లు. ఇజ్రాయిల్ పండ్ల ఉత్పత్తిలో నారింజ, ద్రాక్షపండ్లు, నిమ్మకాయలు, యాపిల్, నేరేడు పండు, ద్రాక్ష, పీచు, మామిడి రేవు మరియు బెర్రీస్ ముఖ్యమైనవి. ఇజ్రాయిల్‌లో ప్రారంభించిన డ్రిప్ మైక్రో ఇరిగేషన్ పరిష్కారాలు ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌లో ఇప్పుడు కొత్తగా సొంతంగా శుభ్ర పరచుకొని నీటి నాణ్యత తో సంబంధం లేకుండా ఏకరీతి నీటి ప్రవాహం ఉండేటట్లు అభివృద్ధి చేశారు. వేడి పొడి వాతావరణంలో సాగు చేయగలిగే బంగాళదుంప జాతుల అభివృద్ధి, ఉప్పు నీటి ద్వారా సేద్యం చేయగలిగే బంగాళదుంప జాతుల అభివృద్ధి, టమాటా లను వీలైనంత రుచికరంగా చేయాలనే లక్ష్యంతో కొత్తరకాల టమాటాలు లేదా చెట్లకు అవసరమైన నీటిని 50 శాతం వరకు తగ్గించడం, జీవ సంబంధమైన తెగులు నియంత్రణ కోసం ప్రయోజనకరమైన కీటకాలు, పురుగుల పెంపకం వంటి చర్యల ద్వారా ఉత్పత్తి పెరిగింది. ఇక సహజ నీటి వనరుల కొరత, పొడి వాతావరణం ఉన్నందున ఇజ్రాయిల్ డీ సాలినేషన్ ప్లాంట్ విస్తృతంగా ఉపయోగించుకుంటోంది. వ్యవసాయం కోసం శుద్ధి చేసిన మురికి నీటిని పునర్వినియోగం చేస్తుంది. లీకేజ్‌లను కనిపెట్టి, నీటి వేస్టేజ్ తగ్గించడానికి కంప్యూటరీకరించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, కంప్యూటరీకరించిన బిందు సేద్యం, మైక్రో స్పింక్లర్లు మొదలైనవి వాడుతుంది. శుద్ధి చేసిన నీటి పునర్వినియోగంలో ప్రపంచానికి ఆదర్శం, సాంకేతిక పరిజ్ఞానాలు ద్వారా ఇజ్రాయిల్ నీటి మిగులు దేశంగా అవతరించింది.