గతేడాది చివర్లో గుజరాతీలో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ‘లాలో – కృష్ణ సదా సహాయతే’. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా, ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. అదేంటీ అనుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు అంకిత్ సఖియా ఒక ఆసక్తికరమైన, కదిలించే విషయాన్ని పంచుకున్నారు. ఏంటంటే.?
Also Read : Jana Nayagan : ‘జన నాయగన్’ సెన్సార్ గండం దాటుతుందా? నేడే ఫైనల్ తీర్పు!
‘మొదట్లో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు, కానీ మౌత్ టాక్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఈ సినిమాను గుజరాతీకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా హిందీలో కూడా విడుదల చేయాలని నిర్ణయించాం. అంతేకాకుండా, సినిమా చూసిన ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి రూ. 5000 బహుమతిగా ఇచ్చాడని, ఆ సంఘటన తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.షాకింగ్ విషయం ఏంటీ అంటే ఈ సినిమా చూసిన తర్వాత జీవితంపై విరక్తి పెంచుకున్న 23 మంది తమ ఆత్మహత్య ఆలోచనలను విరమించుకున్నారు. అంతేకాదు సినిమా చూస్తున్నప్పుడు తమ బాధలు మర్చిపోయి, మానసిక ధైర్యాన్ని పొందామని ఎంతోమంది తనకు మెసేజ్‌లు చేశారు’ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఒక సినిమా కేవలం వినోదాన్ని ఇవ్వడమే కాకుండా, ప్రాణాలను కూడా కాపాడగలదని ఈ చిత్రం నిరూపించింది. దీంతో ఈ చిన్న సినిమా కలిగించిన సామాజిక మార్పు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
