Site icon NTV Telugu

Russia-Ukraine War: పేలుళ్లతో దద్దరిల్లిన కీవ్‌.. కామికేజ్‌ డ్రోన్లతో రష్యా దాడి

Russia Ukraine

Russia Ukraine

Russia-Ukraine War: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ పేలుళ్లతో దద్దరిల్లింది. కామికేజ్‌ డ్రోన్లతో రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్‌ అధికారి ఒకరు తెలిపారు. డ్రోన్లు నగరంపై దాడి చేస్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్ష సలహాదారు వెల్లడించారు. కీవ్‌ను నాశనం చేసేందుకు రష్యా ఆసక్తిగా ఉన్నట్లు అధ్యక్ష ఆఫీసు అధిపతి ఆండ్రీ యెర్‌మాక్‌ తెలిపారు. సెంట్రల్‌ షెవ్‌చెవిన్‌స్కీ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్‌ భవనాలు ధ్వంసమైనట్లు మేయర్‌ విటాలీ క్లిచ్‌కో చెప్పారు. వారం క్రితం కూడా రష్యా మిస్సైళ్లు కీవ్‌ నగరాన్ని బీభత్సం చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 19 మంది మరణించారు.

ఇటీవలి వారాల్లో ఉక్రెయిన్‌లోని కైవ్, విన్నిట్సియా, ఒడెసా, జపోరిజ్జియా మరియు ఇతర నగరాలపై జరిగిన దాడుల్లో మాస్కో ఇరాన్ సరఫరా చేసిన డ్రోన్‌లను ఉపయోగించిందని అధ్యక్ష ఆఫీసు అధిపతి ఆండ్రీ యెర్‌మాక్‌ చెప్పారు. కొత్త సవాలును ఎదుర్కొనేందుకు పాశ్చాత్య దేశాలు తమ సహాయాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు.
ఇవాళ ఉదయం 6:45 గంటలకు ఉక్రెయిన్ రాజధానిలో కనీసం మూడు పేలుళ్లు వినిపించాయి. మొత్తం అయిదు సార్లు ఆ శబ్ధాలు వినిపించినట్లు అధికారులు చెబుతున్నారు. సిటీ సెంటర్‌కు సమీపంలో రెండు పేలుళ్ల శబ్ధాలు వచ్చాయి. రష్యాను ఎదుర్కొనేందుకు మరిన్ని డిఫెన్స్‌ సిస్టమ్స్‌ కావాలని, గగనతలానికి రక్షణ కవచంగా నిలిచే ఆయుధాలు కావాలని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. ప్రస్తుతం దాడులు జరిగిన ప్రదేశాలకు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌, వైద్య సిబ్బంది చేరుకొన్నారని చెప్పారు. ఈ దాడుల్లో ఎంత మంది గాయపడ్డారో మాత్రం వెల్లడించలేదు. కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం కురిపించిన వారం తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం.

Chidambaram: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చిదంబరం స్ట్రాంగ్‌ కౌంటర్‌..

ఇటీవల క్రిమియా రోడ్డు వంతెనపై ట్రక్కు పేలిన తర్వాత రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఈ పేలుడులో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మాస్కో క్రిమియాను స్వాధీనం చేసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత, 2018లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేత క్రిమియా వంతెన ప్రారంభించబడింది. రష్యా నుంచి క్రిమియాకు వెళ్లే మార్గం ఇదే కావడం గమనార్హం. 19 కిలోమీటర్ల వంతెన, కెర్చ్ జలసంధి మీదుగా నడుస్తుంది. క్రిమియాను, రష్యా ప్రధాన భూభాగంతో కలుపుతుంది, ఇది రైల్వే, వాహన విభాగాలను కలిగి ఉంటుంది. ఇది 2020లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.

కామికేజ్‌ డ్రోన్లు అంటే చిన్నపాటి ఏరియల్ ఆయుధాలు. లక్ష్యాన్ని ఢీకొన్న అనంతరం ఈ డ్రోన్లు పేలుతాయి. సాధారణంగా చాలావరకు డ్రోన్లు అంటే బాంబులను వదిలి వెనక్కి వస్తాయి.. కానీ ఈ కామికేజ్‌ డ్రోన్లు మాత్రం అక్కడే పేలిపోతాయి.

Exit mobile version