NTV Telugu Site icon

Kurumurthy Brahmotsavam: పేదల తిరుపతి.. కురుమూర్తి బ్రహ్మోత్సవాల ప్రత్యేకం..

Kurumurthy

Kurumurthy

Kurumurthy Brahmotsavam: తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఒక టిగా పేరుగాంచిన దేవస్థానం శ్రీ కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం. తిరుమల వేంకటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయాని కి పోలికలున్నాయి. అమ్మాపూర్‌ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలసిన స్వామి వారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు. పూర్వం కురుమూర్తికి ‘కురుమతి’ పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తోంది. ఇక, పేదల తిరుపతిగా విలసిల్లుతున్న కురుమార్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. యాగశాల మండపాలంకరణంతో వేడుకలు మొదలయ్యాయి.

Read Also: Pawan Kalyan : ఉత్తరాంద్ర to నెల్లూరు.. ఊపేసిన OG థియేట్రికల్ రైట్స్

శ్రీ వేంకటేశ్వరస్వామి వారు ఇక్కడకు రావడానికి రెండు రకాల పురాణ గాథలు ఉన్నాయి. ఇందులో.. తిరుపతి నుంచి కురుమూర్తికి రావడానికి కారణం కుబేరుని అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి. తిరుపతి నుంచి ఇక్కడికి ఉత్తరముఖంగా వస్తున్న సమయంలో.. సుగంధభరిత నానాఫల వృక్షాలతో కనబడిన గుట్టపై కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆగినట్టు పురాణ గాథ. ఇక్కడ ‘కురు’ అనగా చేయుట, ‘మతి’ అనగా తలచుట అని అర్థం. అందుకే ఈ స్వామికి ‘కురుమతి’ అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది ‘కురుమూర్తి’గా స్థిరపడి పోయినట్లు పూర్వీకులు చెబుతుంటారు. దాదాపు 900 సంవత్సరాల నుండి స్వామి వారు పూజలు అందుకున్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత దేవరకద్ర నియోజక వర్గంలోని అమ్మాపూర్ ప్రాంతంలో ఎత్తయిన ఏడు కొండలపై ఉన్న కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం క్రీ.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపు రుషుడు గోపాలరాయుడు నిర్మించగా.. 1350లో చంద్రారెడ్డి అభివృద్ధిపరచగా, సోమ భూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సంప్రదాయం అమలులోకి తెచ్చారని తెలుస్తోంది. 1870లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఉద్దాల ఊరేగింపు ప్రధాన ఘట్టంగా ఉంటుంది . ఉద్దాలు అంటే పాదుకలు అని అర్ధం. స్వామి వారి పాదుకలను ఊరేగింపు చేసే కార్యక్రమాన్ని, పవిత్రంగా, ప్రాధాన్యతతో నిర్వహిస్తారు.

Read Also: PM Modi: ఒకేసారి ఎన్నికలు, యూనిఫాం సివిల్ కోడ్, అర్బన్ నక్సల్స్.. మోడీ పవర్ ఫుల్ స్పీచ్..

కురుమూర్తి దేవ స్థానానికి దళితులకు విడదేయరాని బంధం ఉంది. స్వామివారి పాదుకలను వడ్డెమాన్‌లోని ఉద్దాల మండపంలో రాయలసీమ ప్రాంతం నుంచి సేకరించిన నాణ్య మైన ఆవు చర్మంతో పాదుకలను దళితులు తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు నుంచి 7 రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపావాస దీక్షలతో స్వామి పాదుకలు ఉద్ధాలు చేస్తారు. వారి పూజలు అనంతరం ఉద్దాలను ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు. ఉద్దాల మండపంలో దళితులే అర్చకులు. ఇది చాలా అరుదైన విషయం. ఇక, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి కురుమూర్తి అనేక పోలికలున్నాయి. ఇక్కడ కూడా ఆ స్వామి ఏడు కొండలపైనే కొలువుదీరడం విశేషం. ఏడు కొండల్లో దేవతాద్రి అని పిలిచే దేవరగట్టపైనే కురుమూర్తి వేంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్నారు. తిరుపతి క్షేత్రంపై మేరు పర్వత పుత్రుడైన ఆనందగిరిపై శ్రీనివాసుడు వెలసి ఉన్నాడని పురణాలు చెబుతున్నాయి. శ్రీ కురుమూర్తి కొండలు ఆనందగిరిలో భాగమేనని అచట వెలసిన స్వామి వారే ఇచ్చట వెలిశారని స్థల పురాణంలో చెప్పబడినది.

Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్‌ని చంపేస్తామని బెదిరింపు.. నిందితుడి అరెస్ట్..

ఇక తిరుపతిలో విఘ్నేశ్వరుని విగ్ర హం లేదు. కురుమూర్తిలో కూడా లేదు. వేంకటాచలంతో స్వామి నిల్చున్న భంగిమల్లో ఉండగా కురుమూర్తి స్వామి అదే భంగిమలో ఉండడం విశేషం. తిరుమలకు మెట్లపై వెళ్లేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నాట్లు కురుమూర్తిలో ఇక్కడా ఉన్నాయి. అందుకే పేదల తిరుపతిగా , తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి దేవస్థానం లో ఆ వెంకటేశ్వరుడు పూజలందుకుంటున్నారు. ఇంతటి ప్రాముఖ్యత గల శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు దీపావళి సందర్భంగా ఈ రోజు ప్రారంభం అయ్యాయి.. బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల ఉత్సవం , అలంకరణోత్సవాలతో పాటు స్వామి వారి కళ్యాణం వంటి ప్రధాన ఘట్టాలుగా ఉండనున్నాయి . ప్రతియేటా కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సుమారు మూడు లక్షల మంది హజరవుతుండగా.. ఈ సారి ఆ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు . ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు.. నవంబర్‌ 2న ధ్వజారోహణం, అష్టోత్తర శతకలశాభిషేకం, స్వామి కల్యాణం, మయూర వాహనసేవ నిర్వహించనున్నారు.. 3న ప్రత్యేక పూజలు, హంసవాహన సేవ.. 4న శేషవాహన సేవ.. 5న ప్రత్యేక పూజలు, గజవాహన సేవ.. 6న స్వర్ణాభరణాలచే అలంకారం, అశ్వవాహన సేవ..7న హనుమంత వాహనసేవ, గరుడ వాహనసేవ.. 8న ఉద్దాలోత్సవం.. 9న ఆవాహిత దేవతా పూజలు, హోమాలు, పుష్పయాగం.. 10న అవభృత, మంగళ నీరాజనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు..