NTV Telugu Site icon

Kannepalli Pump House: ఆగస్టు 2 డెడ్‌లైన్‌.. 50 వేల మంది రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తాం: కేటీఆర్‌

Ktr Speech

Ktr Speech

BRS Leaders Kannepalli Pump House Today: ఆగస్టు 2వ తేదీలోపు కన్నెపల్లి పంప్‌హౌజ్‌లు ప్రారంభించకపోతే.. 50 వేల మంది రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తాం అని తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఓ గుండె లాంటిందని, రాష్ట్రంలో కరువు అనే మాట వినపడకుండా ముందు చూపుతో కేసీఆర్‌ కాళేశ్వరం నిర్మించారన్నారు. కాళేశ్వరాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని, చిన్న సమస్య తలెత్తితే ప్రాజెక్ట్‌పై విష ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ వద్ద పరిస్థితులను పర్యవేక్షించారు.

కన్నెపల్లి పంప్‌హౌజ్‌ వద్ద కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనంత గొప్పగా ముందు చూపుతో కాళేశ్వరంను కేసీఆర్ నిర్మించారు. బహుళార్థ ప్రయోజనాల లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. అత్యంత ఎత్తైన 618 అడుగుల కొండపోచమ్మ సాగర్ వరకు నీరు వెళ్లే విధంగా డిజైన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కామధేనువు లాంటిది. ఎగువ గోదావరి నుంచి దిగువన ఉన్న కాళేశ్వరం వరకు పరిశీలించాము. కరవు పీడిత ప్రాంతాల కోసం కాళేశ్వరం కట్టాము. కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయవచ్చా అధికారులను అడిగి తెలుసుకున్నాం. కాళేశ్వరం విషయంలో రాజకీయాలు చేయకండి అని గతంలో ప్రభుత్వానికి చెప్పాము. అన్నారంలో గ్రౌటింగ్ చేశారా అని మేము ఇంజనీర్లను ఆడిగాము. రెగ్యులర్‌గా గ్రౌటింగ్ జరుగుతుంది. ఎన్డీఎస్‌ఏ చెప్తేనో కాదు.. రెగ్యులర్‌గా గ్రౌటింగ్ చేస్తామన్నారు. రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తి పోసుకోవచ్చు. నీరు ఉంది కానీ లిఫ్ట్ చేసేందుకు రాజకీయ సంకల్పం లేకపోవడం వల్ల జరగడం లేదు’ అని అన్నారు.

‘ఇంజనీర్‌లతో మాట్లాడిన తర్వాత మాకు ఒకటి అర్థమైంది. కేసీఆర్‌ని బద్నామ్ చేసేందుకు ఈ ప్రభుత్వం ఇదంతా చేస్తుంది. ఇక్కడ నుంచి లిఫ్టింగ్ ప్రారంభిస్తే 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చు. ఆరు నెలలు రాజకీయం చేద్దాం.. నాలుగున్నర ఏళ్ళు ప్రజల కోసం పని చేద్దాం. పంపులు ప్రారంభించండి రాజకీయాలు మానండి. పంపులు ప్రారంభిస్తారా లేదా?. అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు గదువునిస్తున్నాం. అగస్టు 2వ తేదీలోపు పంపులు ప్రారంభించకపోతే.. 50 వేల మంది రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే మేమే వచ్చి పంప్ హౌజ్ లను ఆన్ చేస్తాం. ఉద్దేశ్య పూర్వకంగా, నెరపూరిత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 100 భాగాలు ఉన్న ప్రాజెక్ట్ లో చిన్న భాగంలో సమస్య వస్తే రాద్దాంతం చేస్తున్నారు. ఎన్డీఎస్‌ఏ సూచనల మేరకే అన్నారంలో నీరు నింపడం లేదని అనడం అబద్దం. గ్రౌటింగ్ అనేది రెగ్యులర్ ప్రాసెస్. నీళ్లు నింపితే కాంగ్రెస్ పార్టీ మాటలు అబద్దం అని తేలుతుందని తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. ఎన్డీఎస్‌ఏ కాళేశ్వరం రాలేదు. రాకుండానే రిపోర్టు ఇచ్చింది. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ కలిసి తప్పుడు రిపోట్లులు ఇచ్చేలా చేశారు. పోలవరం కొట్టుకుపోతే ఇప్పటి వరకు ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్ ఇవ్వలేదు. కాళేశ్వరంలో మాత్రం ఒక్కరోజులో ఇచ్చారు’ అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.