బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్ తరఫున లాయర్ ఉమామహేశ్వర్ రావు ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు.
తన ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టును కోరుతూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ సినీ రంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ.. కేటీఆర్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం మంత్రి క్షమాపణలు చెప్పి.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.
Also Read: Ratan Tata: టీమిండియా క్రికెటర్లకూ అండగా రతన్ టాటా.. ఐపీఎల్‌కు స్పాన్సర్‌గా!
ఇప్పటికే మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. మంత్రి తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని.. ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ కొనసాగుతోంది. రెండో సాక్షి స్టేట్మెంట్‌ను కోర్టు రికార్డు చేస్తోంది. కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.