Annam Movie: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ అనే సినిమా రూపొందనుందని అప్పట్లో విశేషంగా వినిపించింది. బాలకృష్ణ తన 100వ చిత్రంగా ఏ సినిమా చేయాలి అన్న నేపథ్యంలో పలు కథలు ఆయనను పలకరించాయి. అందులో కృష్ణవంశీ ‘రైతు’ కథ ఒకటి. ఆ సినిమాలో ఎంతో ఉదాత్తమైన ప్రెసిడెంట్ రోల్ ఒకటి ఉంది. దానిని అమితాబ్ బచ్చన్ పోషిస్తేనే, ఈ సినిమా ఉంటుందని లేదంటే లేదని బాలకృష్ణ ముందుగానే చెప్పారట. కృష్ణవంశీ ‘రైతు’ కథ బాలయ్యకు నచ్చినప్పటికీ అప్పట్లో అమితాబ్‌కు ఉన్న పరిస్థితుల కారణంగా ఆయన ఓకే చెప్పలేదు. దాంతో ‘రైతు’ పట్టాలెక్కలేదు. ఇప్పుడు కృష్ణవంశీ తన ‘రంగమార్తాండ’ తరువాత ‘అన్నం’ అనే చిత్రాన్ని రూపొందిస్తానని అంటున్నారు. అప్పటి ‘రైతు’ కథనే ఇప్పుడు ‘అన్నం’గా మారిందని కొందరు అంటున్నారు. ఈ విషయాన్ని కృష్ణవంశీ దృష్టికి తేగా కాదని ఆయన సమాధానమిచ్చారు.
Satyadev: ఫైనాన్షియల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వేసవిలో!
‘రైతు’ కథలో రైతుల సమస్యలు, వారి కష్టాన్ని సొమ్ముచేసుకొనే దోపిడీదారుల కథ ఉందని, ఈ ‘అన్నం’లో దేశంలోని ఫుడ్ మాఫియా గురించి చర్చిస్తున్నామని కృష్ణవంశీ వివరించారు. రెండు కథల్లోనూ కొందరు స్వార్థపరుల ద్వారా సామాన్యులు ఎలా నష్టపోతున్నారు అన్నది ప్రధానాంశమని కృష్ణవంశీ చెప్పారు. ‘రంగమార్తాండ’ విడుదలయ్యాక ఈ ‘అన్నం’ పట్టాలెక్కనుంది. మరి ‘రైతు’ కథను తెరపై చూపించలేక పోయిన కృష్ణవంశీ ఈ ‘అన్నం’తోనైనా అభిమానులకు ఆనందం పంచుతారేమో చూడాలి.
