Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!

  • వైభవంగా కోటి దీపోత్సవం తొమ్మిదో రోజు
  • కంచి విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం
  • కంచి కామాక్షి మహాభిషేకం, కుంకుమార్చన
  • కన్నులపండువగా మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం
Day 9+

Day 9+

కార్తీక మాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం–2026 వేడుకలు భక్తి పారవశ్యంతో సాగాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, కల్యాణోత్సవాలతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్న ఈ ఉత్సవాల్లో, నవంబర్ 22 ఆదివారం తొమ్మిదో రోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్తీక ఆదివారం, ప్రదోష పర్వదినం సందర్భంగా నిర్వహించిన పలు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె. లక్ష్మణ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పీఠాధిపతి సందేశం.. ప్రవచనామృతం

తొమ్మిదో రోజు వేడుకల్లో భాగంగా మూలామ్నాయ కంచి సర్వజ్ఞ పీఠాధిపతీశ్వరులైన జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామీజీ అనుగ్రహ భాషణం భక్తులకు మార్గదర్శనం చేసింది. స్వామీజీ ఆశీస్సులు, ఆధ్యాత్మిక సందేశాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ నందూరి శ్రీనివాస్ ప్రవచనామృతం వినిపిస్తూ, ధర్మం, భక్తి, ఆధ్యాత్మిక విషయాలపై భక్తులకు సందేశాన్ని అందించారు.

విశేష పూజలు.. భక్తుల కుంకుమ అర్చన

వేదికపై కంచి కామాక్షి మహాభిషేకం, చందనాలంకార దర్శనం, కోటి సుపుష్పకుంకుమల సమర్పణోత్సవం, ఉజ్జయిని మహాకాళుని భస్మహారతి వంటి ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు భక్తుల చేతుల మీదుగా కంచి కామాక్షి విగ్రహాలకు పసుపు కుంకుమల అర్చన నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.

మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణం.. పల్లకి సేవ

వేడుకల్లో ప్రధాన ఘట్టంగా మధురై శ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. కార్యక్రమాల ముగింపులో పల్లకి వాహన సేవ నిర్వహించగా, సప్త హారతులు, స్వర్ణ లింగోద్భవం భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. కార్తీక మాసంలో నిర్వహిస్తున్న ఈ కోటి దీపోత్సవంలో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు పాల్గొంటుండగా, తొమ్మిదో రోజు వేడుకలు ఆధ్యాత్మిక శోభతో ఘనంగా ముగిశాయి.