Koti Deepotsavam Day-12: కోటి దీపోత్సవంలో రామేశ్వర వైభవం.. నేడు రామనాథస్వామి కల్యాణం.!

  • సచ్చిదానంద భారతి స్వామీజీ అనుగ్రహ భాషణం
  • మహావిష్ణువుకు కోటి తులసీఅర్చన
  • శ్రీకృష్ణ మహాభిషేకం, జగన్నాథుడికి చప్పన్ భోగ్
  • రామనాథస్వామి కల్యాణం, పల్లకీ సేవ
Day12

Day12

భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం–2026 వేడుకలు నేడు (నవంబర్ 25, 2026, బుధవారం) పన్నెండో రోజుకు చేరుకున్నాయి. కార్తీక బహుళ పాడ్యమి పర్వదినాన జరుగుతున్న ఈ విశేష కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవం, వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. అనుగ్రహ భాషణాలు, ప్రవచనామృతం, విశేష అభిషేకాలు, కల్యాణ ఘట్టాలతో నేటి వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తనున్నాయి.

అనుగ్రహ భాషణం.. ప్రవచనామృతం

పన్నెండో రోజు వేడుకల్లో భాగంగా కేరళలోని కాసర్‌గోడ్ ఎడనీరు మఠానికి చెందిన శ్రీ సచ్చిదానంద భారతి స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం ఇవ్వనున్నారు. ఆధ్యాత్మిక సందేశాలతో భక్తులకు మార్గదర్శనం చేయనున్న స్వామీజీ భాషణం అనంతరం, శ్రీ గడ్డమణుగు తేజస్వి శర్మ ప్రవచనామృతం ద్వారా కార్తీక మాస విశిష్టతను, ఆధ్యాత్మిక అంశాలను భక్తులకు వినిపించనున్నారు.

వేదికపై ప్రత్యేక పూజలు.. భక్తులచే తులసీఅర్చన

నేటి వేడుకల్లో వేదికపై నిర్వహించే ప్రత్యేక పూజలకు విశేష ప్రాధాన్యం ఉంది. శ్రీ మహావిష్ణువుకు కోటి తులసీఅర్చనతో పాటు శ్రీకృష్ణ మహాభిషేకం, పూరీ జగన్నాథ్ చప్పన్ భోగ్ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. మరోవైపు వేడుకలకు విచ్చేసే భక్తులు స్వయంగా పాల్గొనేలా విష్ణుమూర్తి విగ్రహాలకు కోటి తులసీఅర్చన కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు.

రామనాథస్వామి కల్యాణం.. పల్లకీ వాహన సేవ

పన్నెండో రోజు ఆధ్యాత్మిక సంబరాల్లో ప్రధాన ఘట్టంగా రామేశ్వరం శ్రీ రామనాథస్వామి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. కల్యాణోత్సవం అనంతరం స్వామివారి పల్లకీ వాహన సేవ జరగనుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని, వాహన సేవను వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు.