Koppula Eshwar Said BRS not merging BJP: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అంటూ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ‘ఇయర్ ఆఫ్ ది జోక్’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీలోనే కాదు.. ఏ పార్టీలో విలీనం కాదన్నారు. సీఎం రమేష్ ఎప్పుడు బీజేపీలో చేరారు అని, బీజేపీలో ఆయనకు ఉన్న పరపతి ఎంత అని ప్రశ్నించారు. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రమేష్ మధ్యవర్తిగా ఉన్నారా? లేదా? అని తెలంగాణ ప్రజలకు సీఎం రమేష్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీది తెలంగాణ భావజాలం అని, బీజేపీది ఆర్ఎస్ఎస్ భావజాలం అని పేర్కొన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లకు బ్రోకరిజం చేసే సీఎం రమేష్ మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవద్దని కొప్పుల ఈశ్వర్ చెప్పుకొచ్చారు.
‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అంటూ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇయర్ ఆఫ్ ది జోక్. సీఎం రమేష్ ఎప్పుడు బీజేపీలో చేరారు, బీజేపీలోఆయనకు ఉన్న పరపతి ఎంత. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించి 10 వేల కోట్ల రుణాలు ఇప్పించారన్నారు. దీనికి సీఎం రమేష్ సమాధానం చెప్పకుండా, విలీనం అంశం ఎందుకు మాట్లాడుతున్నారు. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రమేష్ మధ్యవర్తిగా ఉన్నారా? లేదా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. కేటీఆర్ నా ఇంటికి వచ్చి కలిశారని అంటున్న సీఎం రమేష్.. నీ కంపెనీ కోసం, నీ కాంట్రాక్టుల కోసం అధికారంలో వున్నప్పుడు కేటీఆర్ వెంటపడలేదా?. బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీలోనే కాదు ఏ పార్టీలో విలీనం కాదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పేట్టు కోలేదు. భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి పొత్తు ఉండదు. బీఆర్ఎస్ పార్టీది తెలంగాణ భావజాలం… బీజేపీది ఆర్ఎస్ఎస్ భావజాలం’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
‘రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ సీఎం రమేష్ చదువుతున్నారు. టీడీపి నుంచి రాజ్యసభ ఎంపీ అయ్యి ఈడీ, సీబీఐ కేసులకు భయపడి బీజేపీలో చేరిన సీఎం రమేష్ మాటలకు విలువ ఉందా?. సీఎం రమేష్ చరిత్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఆంధ్రా ఎంపీ సీఎం రమేష్ అక్కడ ఉన్న కుల పంచాయతీలు తెలంగాణకు తీసుకురావాలని చూస్తున్నారు. ఆయన లాంటి వాళ్ళతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. సీఎం రమేష్ ప్రస్తావన చేసిన కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు ఉందా?. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల వారు అత్యధికంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలుగా, పార్టీ పదవుల్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచాలని రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ సీఎం రమేష్ చదివారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ నాయకత్వానికి అన్ని వర్గాలు మద్దతు తెలిపాయి. 2023లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోయినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ సీట్లు గెలిచింది. సెటిలర్స్, కమ్మ, రెడ్డి, అన్ని సామాజిక వర్గాల వారు కేసీఆర్, కేటీఆర్ నాయకత్వానికి ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సామాజికవర్గాల వారిని కేటీఆర్ ఎట్లా తిడతారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లకు బ్రోకరిజం చేసే సీఎం రమేష్ మాటలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవద్దు’ అని కొప్పుల ఈశ్వర్ సూచించారు.
