జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న భక్తులకు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సుమారు ఆరు దశాబ్దాల (60 ఏళ్ల) తర్వాత అంజన స్వామి నిజరూప దర్శనం కల్పించే అరుదైన కార్యక్రమానికి వేళయింది. నవంబర్ 15 నుంచి 20 వరకు కొండగట్టులో అత్యంత వైభవంగా చందనోత్సవ మహా సంప్రోక్షణ వేడుకలు ప్రారంభమయ్యాయి. దశాబ్దాలుగా స్వామివారి మూలవిరాట్టుకు పూస్తున్న చందనపు పొరలను ప్రత్యేక పద్ధతిలో తొలగించే బృహత్తర కార్యక్రమం నేటి నుంచి మొదలైంది.
40 రోజుల పాటు నిజరూప దర్శన భాగ్యం
ఆరు దశాబ్దాలుగా స్వామివారి అలిమేరుపై పేరుకుపోయిన చందనపు పొరలను శాస్త్రోక్తంగా తొలగించిన అనంతరం భక్తులకు అంజన్న నిజరూప దర్శనం లభించనుంది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 29 వరకు సుమారు 40 రోజుల పాటు భక్తులు స్వామివారి నిజరూపాన్ని కళ్లారా వీక్షించి తరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అరుదైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కొండగట్టుకు తరలివచ్చే అవకాశం ఉంది.
ఘనంగా ఏర్పాట్లు.. ప్రముఖులకు ఆహ్వానం
ఈ చారిత్రాత్మక ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పకడ్బందీగా చేపట్టారు. ఈ మహా సంప్రోక్షణ మహోత్సవాలకు ముఖ్యమంత్రి సహా పలువురు ప్రముఖులకు ఇప్పటికే ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికలు అందజేశారు. దశాబ్దాల తర్వాత అంజన్న నిజరూపాన్ని దర్శించుకునే భాగం కలగనుండటంతో భక్తుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

