Site icon NTV Telugu

Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఇంటిముందు నిరసన.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక!

Konda Surekha

Konda Surekha

CITU Workers Protest Outside Minister Konda Surekha’s House: హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు సీఐటీయూ కార్యకర్తలు నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం అక్షయపాత్రకి ఇవ్వొద్దంటూ మంత్రి ఇంటి ముందు సీఐటీయూ కార్యకర్తలు నిరసనకు దిగారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు కేటాయించే ప్రతిపాదనలను విరమించుకోవాలంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవన సాగిస్తున్న వారికి నష్టం చేసే తీరును విరమించుకోకపోతే.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ కార్యకర్తలు హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Viral Video: హృదయ విదారక ఘటన.. బైక్‌పై భార్య మృతదేహం తరలింపు, నిస్సహాయంగా భర్త!

అక్షయపాత్ర ఫౌండేషన్ అనేది భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పోషకాహారం అందిస్తుంది. అక్షయపాత్ర 2000 సంవత్సరంలో బెంగళూరులో ఐదు పాఠశాలల్లో 1,500 మంది పిల్లలతో ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 17 వేల పాఠశాలల్లో 2 మిలియన్లకు పైగా పిల్లలకు భోజనం అందిస్తుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని హనుమకొండ జిల్లాలో అక్షయపాత్రకు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ గతంలోనే డిమాండ్ చేశారు.

తాజాగా సీఐటీయూ కార్యకర్తలు మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు నిరసన చేపట్టారు. 20 సంవత్సరాలకు పైగా మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకి భోజనం వండి పెడుతున్నారని, వారికి అన్యాయం చేయొద్దని కోరుతున్నారు. అధికారులు కార్మికుల పొట్ట కొట్టే నిర్ణయాలు తీసుకోవడం సరికాదంటున్నారు. 8 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా.. సుబేదారి పోలీసులు సీఐటీయూ కార్యకర్తలను అడ్డుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Exit mobile version