OTR: ఈ.. నటన ఏదైతే ఉందో…!

  • కోనసీమ వైసీపీలో ఐక్యతా దృశ్యాలు..
  • చూసేదంతా నిజమేనా అంటూ కేడర్‌కే సందేహాలు..
  • విశ్వరూప్‌కు, చిర్ల జగ్గిరెడ్డికి మధ్య తీవ్ర విభేదాలు
Dfffff

Dfffff

కోనసీమ వైసీపీలో కనిపిస్తోందంతా నిజమేనా? లేక లోకల్‌ నాయకులు చేస్తున్న కనికట్టా? నిన్నటిదాకా ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడని వాళ్లు ఇప్పుడు మాత్రం… భుజం భుజం రాసుకుని తిరగడం వెనకున్న కారణం ఏంటి? మార్పు మంచిదే అయినా… అది బలవంతమా? స్వచ్చందమా? ప్లాస్టిక్‌ నవ్వులు, పై పూత కోటింగ్‌లన్న డౌట్‌ సొంత కేడర్‌కే ఎందుకు వస్తోంది?

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ నేతలు ఒక్కతాటిపైకి వచ్చినట్టు కనిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతర్గత విభేదాలు.. గ్రూపు రాజకీయాలతో సతమతమైన వైసీపీలో.. ఇప్పుడు నేతలంతా కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటూ కనిపిస్తున్నారు. కానీ…ఇదంతా నిజమేనా? అంటూ సొంత పార్టీ కేడర్‌లో కూడా సందేహాలు అలాగే ఉన్నాయి. రెండేళ్ళుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తిరిగి యాక్టివ్ కావడం ఆసక్తి రేపుతోంది. ఒకప్పుడు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న విశ్వరూప్‌కు, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డికి మధ్య సఖ్యత లేదన్న ప్రచారం పార్టీలో బలంగా ఉంది. కానీ ఇప్పుడు… ఇద్దరూ కలిసి వివిధ వేదికల మీద కనిపిస్తుండటంతో… ఇది నిజమేనా లేక కడుపులో కత్తులు ఉన్నాయా అన్న సందేహాలు పెరుగుతున్నాయి.

కోనసీమ జిల్లా వైసీపీలో దాదాపు ప్రతి నియోజకవర్గంలో వర్గ విభేదాలున్నాయి. ఆ ప్రభావం 2024 ఎన్నికల్లో కనిపించిందన్నది పార్టీ పెద్దల విశ్లేషణ. జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది. దాంతో… బలోపేతంపై దృష్టి పెట్టిన పార్టీ పెద్దలు… నేతలంతా కలిసి పనిచేయాలని సూచించారట. ప్రత్యేకంగా అధినేత జగన్‌ ఘాటుగానే హెచ్చరించినట్టు తెలిసింది. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి మరింత నష్టం తప్పదని వార్నింగ్‌ వచ్చినట్లు సమాచారం.

కట్ చేస్తే….ఇప్పుడు కోనసీమ వైసీపీలో సీన్ పూర్తిగా మారినట్టే కనిపిస్తోంది. డీఎస్సీ అక్రమాలపై ఉద్యమం కావచ్చు..ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కావచ్చు..పార్టీ చేపట్టే ప్రోగ్రామ్స్‌ ఏవైనా సరే… నేతలు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఐక్యతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా విశ్వరూప్ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఆసక్తిగా మారింది. అయితే అసలు ప్రశ్న ఇక్కడే వస్తోంది. ఈ ఐక్యత నిజంగా మనస్ఫూర్తిగా వచ్చిందా..?లేక..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా భుజం భుజం రాసుకుని తిరుగుతున్నారా అంటూ సొంత కేడర్‌లోనే చర్చ జరుగుతోంది.

అధినేత ఇచ్చిన ఆదేశాలు గట్టిగా పనిచేసి మార్పు వస్తే మంచిదేగానీ…అంతా పై పూత అయితే మాత్రం మళ్లీ సమస్యలు తప్పవని అంటున్నారు. విశ్వరూప్ యాక్టివ్ కావడం.. జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డితో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం.. ఇతర నియోజకవర్గాల నేతలు కూడా ఒకే వేదికపైకి రావడం..ఇవన్నీ చూస్తుంటే వైసీపీలో కొత్త మార్పు మొదలైనట్టు కనిపిస్తున్నా…. ఇంటర్నల్‌గా సందేహాలు మాత్రం అలాగే ఉన్నాయట. పాత విభేదాలు పూర్తిగా సమసిపోయాయా..? లేదా అన్నది తేలాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.