Minister Seethakka : కొమురం భీం జిల్లాలోని కెరమెరి మండలంలోని జంగుబాయి జాతర ఘనంగా జరుగుతున్నది. ఈ జాతరలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క గిరిజన సంప్రదాయ చీరకట్టులో పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన మహిళలు గోలుసు, కడియాలు, చీరకట్టులో పాల్గొని తమ సంప్రదాయాన్ని ఉత్సవంగా జరుపుకున్నారు. మంత్రితోపాటు, ఎమ్మెల్యే కొవ్వ లక్ష్మి కూడా ఆదివాసీ సంప్రదాయ వేషధారణలో జాతరలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, మంత్రి సీతక్క జంగుబాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులైన కటోడాలను సన్మానించారు. జోడేఘాట్ వద్ద కుమ్రంభీం విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఆమె, ఆదివాసీ ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదివాసీ సంస్కృతి , సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని కాపాడుకోవాలని మంత్రి సీతక్క కోరారు. అడవుల్లో జీవిస్తున్న ఆ ప్రజల ప్రత్యేక జీవన విధానాన్ని సమర్థించారు. అలాగే, రూ.50 లక్షలతో జంగుబాయి పుణ్యక్షేత్రం లో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తామని, క్షేత్రానికి సంబంధించిన భూములకు పట్టాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
జోడేఘాట్ అభివృద్ధికి టూరిజం శాఖ నుండి రూ. 5 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆమె చెప్పారు. జోడేఘాట్ ను టూరిస్ట్ , హిస్టారికల్ ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. కుమ్రంభీం వర్ధంతి , జయంతి అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ నెల 17, 18 తేదీల్లో ఎమ్మెల్యేలతో కలిసి ట్రైబల్ అడ్వైజర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఆదివాసుల అభివృద్ధిపై చర్చలు జరపనున్నట్లు మంత్రి చెప్పారు. ఆమె, ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం తాగి స్పీడ్ గా వాహనాలు నడపవద్దని సూచించారు.
Los angeles Wildfires: లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో హాలీవుడ్ నటి సజీవదహనం