Minister Komatireddy comments on MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత బీసీ ధర్నా జోక్ అని ఎద్దేవా చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కోట్లాడుతాం అని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం చేస్తా అని కవిత తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నల్లగొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. మినిస్టర్ క్యాంప్ ఆఫీస్‌కు ఇందిరా భవన్‌గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘క్యాంప్ ఆఫీస్‌కు ఇందిరా భవన్‌గా నామకరణం చేశాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో మొదటి ఏడాది నేను బాధపడ్డాను. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో అందరూ సమానమే. నల్లగొండ జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్ట్ లను ఏడాదిలో పూర్తి చేస్తాం’ అని మంత్రి చెప్పారు.
Also Read: MLC Kavitha: నీళ్లు కూడా తాగను.. పోలీస్ స్టేషన్‌లో కూడా దీక్ష చేస్తా!
‘కేబినెట్‌లో జరగబోయే చర్చపై నేను ముందుగా మాట్లాడను. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ నిందితులు జైలుకు వెళ్తారు. నా ఫోన్ ట్యాప్ కాలేదు. బనకచర్ల కట్టనివ్వం. కాళేశ్వరం నివేదికపై కేబినెట్‌లో సమగ్రంగా చర్చిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది అందరికీ తెలుసు, ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నాం. కవిత ఎవరో నాకు తెలియదు. కవిత బీసీ ధర్నా జోక్. బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కొట్లాడుతాం. ఆర్డినెన్సును సాధిస్తాం. నారా లోకేష్‌కు రాజకీయ అవగాహన లేదు. భనకచర్లపై అవసరమైతే కేంద్రంపై కొట్లాడుతాం. బనకచర్ల నిర్మాణాన్ని అడ్డుకుంటాం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
