తెలంగాణలో రాజకీయం ఇప్పుడు మునుగోడు వైపే చూస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రానుంది. రేపో మాపో ఎన్నికల సంఘం మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. అయితే.. మరోసారి మనుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తుంటే.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ సైతం గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ చేరారు. అయితే ఆయన మరోసారి మనుగోడు నియోజకవర్గంలో గెలిచి సత్తా చాటాలనుకుంటున్నారు. ఇప్పటికే క్యాడర్‌తో పాటు నియోజకవర్గ ప్రజలతో మమేకమై తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు.
ఈ సందర్భంగా నేడు నల్లగొండ జిల్లా మునుగోడులో బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ సునీల్ బన్సల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించే ప్రతి సమావేశానికి ప్రజల నుండి భారీగా స్పందన వస్తుందన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశ్చర్య వ్యక్తం చేశారని ఆయన వెల్లడించారు. కార్యకర్తల ఉత్సాహం చూసిన తర్వాత మునుగోడలో బీజేపీ గెలవడం ఖాయం అన్న ధీమా వారిలో వ్యక్తం అయిందని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.