Sourav Ganguly in Junior Doctors Protesting: కోల్‌కతా ఆర్‌జీకార్ వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (31)పై హత్యాచారం, హత్య ఘటన దేశమంతా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యావత్ భారతావని కోరుతోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ కోల్‌కతాలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీరికి మద్దతుగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిలవనున్నారని తెలుస్తోంది.
న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్ డాక్టర్ల సమ్మెలో నేడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేరనున్నారని తెలుస్తోంది. దాదా మాత్రమే కాదు ఆయన సతీమణి డోనా గంగూలీ కూడా నిరసనకారులతో చేతులు కలపాలని భావిస్తున్నారట. బాధితురాలికి సంఘీభావం తెలిపేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తన ప్రొఫైల్ ఫోటోను బ్లాక్ కలర్‌గా దాదా మార్చిన విషయం తెలిసిందే.
Also Read: Bigg Boss Telugu 8: సీన్ రివర్స్.. బిగ్‌బాస్ 8 నుంచి వేణు స్వామి అవుట్! కారణం ఆ హీరోనేనా?
అంతకుముందు ట్రైనీ డాక్టర్ మృతిపై సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ‘వైద్యురాలిపై లైంగికదాడి చేసి హతమార్చడం దురదృష్టకరం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళల భద్రతను సమీక్షించాలి. కోల్‌కతాలో జరిగిన ఒక్క ఘటనతో రాష్ట్రంపై చెడు అభిప్రాయానికి రాకూడదు’ అన్నారు. కోల్‌కతా గురించి తప్పుగా మాట్లాడొద్దని దాదా చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుపట్టారు. తీవ్ర విమర్శలు రావడంతో ఆయన మరోసారి స్పందించారు. నేను చేసిన కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నారు. వైద్యురాలిపై జరిగిన ఘటన దారుణం. నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్‌లో మరొకరు దారుణానికి పాల్పడే సాహసం చేయొద్దు అని’ దాదా పేర్కొన్నారు.
