NTV Telugu Site icon

KNRUHS: మరోమారు బయటపడ్డ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్లక్ష్యం.. పాత ప్రశ్నపత్రాలతో విద్యార్థుల ఆవేదన

Kaloji

Kaloji

KNRUHS: వరంగల్ జిల్లా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) అధికారుల నిర్లక్ష్యం మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న నిర్వహించిన పీజీ రేడియాలజీ డయాగ్నోసిస్ పరీక్షలో 2023 నవంబర్‌లో వాడిన పాత ప్రశ్నపత్రాన్నే మళ్లీ ఉపయోగించారు. ఆ ప్రశ్నపత్రంపై కవర్లో ఉన్న కోడ్ నంబర్ కూడా మార్పు చేయకపోవడం గమనార్హం. దీనితో విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత అవకతవకలు ఇంకా కొనసాగుతున్నాయా? కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గతంలో కూడా పరీక్షల నిర్వహణలో అనేక అవకతవకలకు గురైంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలలో బయో కెమిస్ట్రీ పేపర్ 1, పేపర్ 2లో సిలబస్‌లో లేని ప్రశ్నలను అందించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే నిర్లక్ష్యం పీజీ రేడియాలజీ పరీక్షల్లో కూడా కొనసాగుతోంది.

Also Read: Chiranjeevi: యూఏఈలో ఇంటర్నేషనల్ లీగ్ టీ20.. మ్యాచ్‌ను తిలకించిన మెగాస్టార్ చిరంజీవి

సాధారణంగా యూనివర్సిటీ అధికారులు పరీక్ష పత్రాల తయారీ, తనిఖీ ప్రక్రియను నిపుణులతో పకడ్బందీగా నిర్వహించాల్సి ఉంటుంది. మాములుగా పరీక్ష సమయానికి ఒక గంట ముందు పరీక్ష నియంత్రణ అధికారి, సంబంధిత మోడరేటర్ ప్రశ్నపత్రాలను సరిచూడాలి. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు అన్ని వైద్య కళాశాలలకు ఆన్‌లైన్ ద్వారా పేపర్ పంపాలి. కానీ, ఈ పకడ్బందీ ప్రక్రియను పాటించడంలో విశ్వవిద్యాలయం విఫలమవుతోంది. పాత ప్రశ్నపత్రం పునర్వినియోగం చేయడం విద్యార్థులపై అన్యాయం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

Also Read: Manchu Manoj: విష్ణుకి మనోజ్ ఛాలెంజ్.. నేను ఒక్కడినే ఏ ప్లేస్ కైనా వస్తా!

యూనివర్సిటీ పదవుల్లో పదేళ్లుగా ఉన్న అధికారులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోవడం వల్ల ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. తక్షణమే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. కేఎన్‌ఆర్హెచ్యూఎస్ ప్రతిష్టను కాపాడుకోవాలంటే పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికత అవసరం. ఈ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుని, విద్యార్థుల నమ్మకాన్ని పునరుద్ధరించడం అవసరం.