Site icon NTV Telugu

KL Rahul: కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోవాలంటే.. అయ్యర్‌ను పక్కన పెట్టాల్సిందే!

Kl Rahul Batting

Kl Rahul Batting

SunilGavaskar feels Ishan Kishan should continue in India playing XI: ఆసియా కప్‌ 2023లో నేపాల్‌పై ఘన విజయం సాధించిన భారత్.. సూపర్-4కు దూసుకెళ్లింది. పాక్ మ్యాచ్‌లో తడబడిన భారత టాప్ ఆర్డర్.. నేపాల్‌పై చెలరేగింది. అయినా కూడా తుది జట్టు ఎంపికపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఫిట్‌నెస్‌ టెస్ట్ పాస్ అయిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. ఆసియా కప్‌కు అందుబాటులోకి వచ్చాడు. వన్డే ప్రపంచకప్‌ 2023 కోసం ప్రకటించిన జట్టులోనూ ఉన్నాడు. దీంతో ఆసియా కప్‌ సూపర్-4లో రాహుల్‌ను ఆడించాలని టీమ్‌ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

కేఎల్ రాహుల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలంటే.. శ్రేయాస్ అయ్యర్‌ లేదా ఇషాన్‌ కిషన్‌లలో ఒకరిని రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం చేయాల్సి ఉంటుంది. కీపర్‌గా ఉన్న కిషన్‌ను తప్పించే అవకాశం లేదు. ఎందుకంటే.. పాక్‌పై కీలక సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ప్రపంచకప్ నేపథ్యంలో అయ్యర్‌కు ప్రాక్టీస్ అవసరం కాబట్టి అతడిని తీసేయలేరు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరిని తప్పించనున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ సూచన చేసాడు. రాహుల్‌ను తీసుకోవాలంటే అయ్యర్‌ను పక్కన పెట్టాలని సూచించాడు.

సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ‘వికెట్ కీపర్‌ కమ్ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ను తప్పించడం సరైంది కాదు. కేఎల్ రాహుల్‌ తుది జట్టులోకి వచ్చినా.. అతడిని కేవలం బ్యాటర్‌గానే పరిగణించాలి. నేపాల్‌తో మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఎలా ఆడతాడో చూద్దామనుకున్నాం. కానీ అతడికి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. మ్యాచ్‌ పూర్తిగా జరిగి ఉంటే.. టాప్‌ ఆర్డర్ బ్యాటర్లు బరిలోకి దిగే అవసరం ఉండేది. ఒకవేళ నేపాల్‌ మ్యాచ్‌లోనూ శ్రేయస్‌ విఫలమయుంటే.. సూపర్-4 మ్యాచుల్లో రాహుల్‌, కిషన్‌లు 4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవారు’ అని అన్నాడు.

Also Read: India Squad for CWC23: ఇట్స్ ఆఫీషియల్.. ప్రపంచకప్‌ 2023లో ఆడే భారత జట్టు ఇదే! తెలుగోడికి షాక్

‘పాక్‌పై కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఇషాన్‌ కిషన్‌ను తప్పించలేరు. క్లిష్టమైన పరిస్థితుల్లో విలువైన పరుగులు చేసాడు. ఇషాన్‌ను రిజర్వ్‌ బెంచ్‌పై కూర్చోబెట్టడం ఇప్పుడు సరైన పద్ధతి కాదు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్‌ కావడం కూడా అతడికి కలిసొచ్చింది. ఇషాన్‌ ఉంటే తుది జట్టు కూర్పులో మరింత వైవిధ్యం వస్తుంది’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. సన్నీ సూచనలు చేసినా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Exit mobile version