Site icon NTV Telugu

Kishan Reddy : ప్రారంభమైన కిషన్‌ రెడ్డి బైక్‌ ర్యాలీ

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా శుక్రవారం బైక్ ర్యాలీకి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి నాయకత్వం వహించారు. కిషన్‌ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌ జిల్లా పరకాల వరకు చేపట్టిన ర్యాలీని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ జెండా ఊపి ప్రారంభించారు.

దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేని సాహసాన్ని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుకు.. స్వయంగా తానే 200 కిలోమీటర్లపాటు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. 7 గంటలపాటు జరిగిన ఈ ర్యాలీ సందర్భంగా కేంద్రమంత్రికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు.

సికింద్రాబాద్ లో ప్రారంభమైన ఈ ర్యాలీకి బీజేపీ కార్యకర్తలతోపాటు యువత స్వచ్ఛందంగా వాహనాలతో ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. అడుగడుగునా మహిళలు, కార్యకర్తలు.. కిషన్ రెడ్డికి గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీశారు. ఆరతి పట్టి వీరతిలకం దిద్దారు. త్రివర్ణ పతాకాలు, బీజేపీ జెండాలతో ఈ ర్యాలీ పొడగునా రోడ్లన్నీ రంగులమయంగా మారాయి. బైక్ యాత్ర హబ్సిగూడ, ఉప్పల్, ఘట్ కేసర్, భువనగిరి, ఆలేరు మీదుగా జనగాంలో మధ్యాహ్న భోజనం కోసం ఆగింది. భువనగిరిలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి సీనియర్ నాయకుడు ఈశ్వర్ గుప్తాకు కిషన్ రెడ్డి పాదాభివందనం చేశారు.

వరంగల్, ములుగు క్రాస్ రోడ్ మీదుగా పరకాలలోలని అమరధామం వరకు ఈ యాత్ర కొనసాగింది. నిజాం ఉక్కుపిడికిలిలో నలిగిన హైదరాబాద్ సంస్థాన్ విముక్తి గాథ భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ముఖ్యమైన ఘట్టమని దీన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. విమోచన దినోత్సవాన్ని సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవాలనడం ద్వారా విముక్తి పోరాట వాస్తవ చరిత్రను మరుగు పరచాలనే కేసీఆర్ ప్రయత్నాన్ని తిప్పికొట్టి.. వాస్తవ చరిత్రను ప్రజలకు చాటిచెప్పేందుకు కిషన్ రెడ్డి సిద్ధమయ్యారు.

Exit mobile version