ఉద్యోగాలకోసం జన్మభూమిని, మాతృదేశాన్ని వదిలి వచ్చినా.. మన దేశ అభివృద్ధి గురించి ప్రవాసీయులు చేస్తున్న ఆలోచనలు తమలో స్ఫూర్తి రగిలిస్తాయని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అధికారిక పర్యటన కోసం న్యూయార్క్ కు చేరుకున్న సందర్భంగా.. గురువారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున) అమెరికాలోని భారత కాన్సుల్ జనరల్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రవాసీ భారతీయులతో కిషన్ రెడ్డి ఆత్మీయంగా సంభాషించారు. భారతదేశం నేడు సాధిస్తున్న విజయాల్లో, ప్రపంచ ఫార్మారంగ రాజధానిగా, ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ గా ఎదుగుతున్న క్రమంలో దేశ యువతతోపాటు, ప్రవాస భారతీయులు పోషిస్తున్న పాత్ర కీలకమని ఆయన అన్నారు. ‘జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపీ గరీయసీ’ అని రామాయణంలో రాముడు తన సోదరుడైన లక్ష్మణుని బోధించిన మాటలను గుర్తుచేస్తూ.. ఖండాతరాలు దాటి వచ్చినా.. జన్మభూమిపై ప్రవాసీయులు చూపిస్తున్న ప్రేమ, గౌరవం అద్భుతమన్నారు. అమెరికా గడ్డపై ప్రతి భారతీయుడు మన దేశపు రాజదూత (అంబాసిడర్) గా.. దేశ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ప్రశంసించారు. మీ కారణంగా భారతదేశ గౌరవం పదింతలైందని ప్రవాసీయులతో ఆయన అన్నారు.
గతంలో ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటే.. నేడు భారతదేశం ఎన్నో రెట్లు ముందడుగేస్తోందన్న కిషన్ రెడ్డి.. ప్రపంచమంతా ఇవాళ ఆర్థికమాంద్యం ప్రభావంలో ఉంటే.. భారతదేశం మాత్రం దీని కోరల్లో చిక్కుకోకుండా స్థిరమైన అభివృద్ధితో ముందుకెళ్తోందన్నారు. నరేంద్రమోడీ సర్కారు అవలంబిస్తున్న విధానాల కారణంగానే.. భారతదేశం కరోనా సమయంలోనూ స్థిరంగా ఉందన్నారు. ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారతదేశానికి.. ఏటా 3 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు భారతదేశానికి వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 2014-15లో ఉన్న విదేశీ మారక నిల్వలు (45.15 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే.. మే, 2023 నాటికి దేశంలో 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలున్న విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేశారు. 2022-23లో వాణిజ్య, సేవల ఎగుమతుల విలువ 750 మిలియన్ డాలర్లు దాటిన విషయాన్నీ కిషన్ రెడ్డి ప్రస్తావించారు.
ప్రధానమంత్రి మోడీ .. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర భారత్’ నినాదాన్ని ఇచ్చినపుడు దేశంలోని చాలా మంది మేధావులు, విపక్ష నేతలు వ్యంగ్యంగా మాట్లాడిన విషయాన్ని గుర్తుచేస్తూ.. మోడీ తీసుకున్న నిర్ణయం కారణంగా.. 2014లో దేశంలో శూన్యంగా ఉన్న మొబైల్ ఎగుమతులు ఇవాళ రూ.43,500 కోట్లు దాటిన విషయాన్ని కిషన్ రెడ్డి తన ప్రసంగంలో ప్రస్తావించారు. సేవల రంగంలోనూ భారత్ సత్తాచాటుతోందన్నారు. స్టార్టప్ లకు ప్రోత్సాహం, కారణంగా ప్రపంచ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ ను భారతదేశ నిర్మించుకుందన్నారు. ఇందులో 85వేల స్టార్టప్‌లు ఉన్నాయన్నారు. దేశంలో 100కు పైగా యూనికార్న్స్ ఉన్నాయని, వీటి విలువ 350 బిలియన్ డాలర్లకు పైమాటే అని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 14 కీలక రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (PLI)లు ఇవ్వడం తదితర కార్యక్రమాల కారణంగా.. ఈ దశాబ్దిని భారతదేశం ‘టెక్ డెకేడ్’ (టెకేడ్) మార్చుకునే లక్ష్యంతో ముందుకెళ్తోందన్నారు. వివిధ అంతర్జాతీయ అభివృద్ధి సూచీల్లోనూ భారతదేశం 2014తో పోలిస్తే అత్యుత్తమ ర్యాంకింగ్స్ తో ముందుకెళ్తోందన్నారు.
కరోనా మహమ్మారి ప్రభావం సమయంలో.. ఆ తర్వాత ప్రపంచంలోని నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల సందర్భంలోనూ భారతదేశం ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా.. స్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందన్నారు. కరోనానంతర పరిస్థితుల్లో భారత పర్యాటక రంగం, ఆతిథ్య పరిశ్రమ అభివృద్ధి బాట పడుతుండటాన్ని గుర్తుచేస్తూ.. గతంలో ప్రధానమంత్రి చెప్పినట్లుగా.. ఒక్కో ప్రవాసీ భారతీయుడు కనీసం ఐదుగురు భారతీయేతర మిత్రులను మనదేశంలో పర్యటించేందుకు ప్రోత్సహించాలన్న విషయాన్నీ కిషన్ రెడ్డి ప్రస్తావించారు. మరో అడుగు ముందుకేసి.. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా.. భారతీయేతర మిత్రులను ప్రోత్సహించాలని కేంద్రమంత్రి సూచించారు.
ప్రస్తుతం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న మనం.. వచ్చే 25 ఏళ్లలో దేశాన్ని విశ్వగురుగా నిలబెట్టేందుకు భారతీయులతోపాటు.. ప్రవాసీయులు కూడా మరింత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
1994లో యువ రాజకీయ నాయకులుగా నేటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతో కలిసి టూర్ చేసిన సందర్భాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. నేటి పార్లమెంటు వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి కూడా తమతోపాటుగా ఆ టూర్ లో ఉన్నారన్నారు. వైట్ హౌజ్ ముందు నిలబడి ఫొటో దిగిన సందర్భాన్నీ ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో న్యూయార్క్ లో భారత కాన్సుల్ జనరల్ శ్రీ రణధీర్ జైస్వాల్, డిప్యూటీ కాన్సుల్ డాక్టర్ వరుణ్ జెఫ్, భారత టూరిజం డీజీ శ్రీమతి మనీషాతోపాటుగా పలువురు భారత ప్రభుత్వ అధికారులు, పెద్దసంఖ్యలో ప్రవాసీయులు పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం (భారతకాలమానం ప్రకారం 14వ తేదీ అర్థరాత్రి తర్వాత) ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో హైలెవల్ పొలిటికల్ ఫోరం (HLPF) వేదికగా వివిధ దేశాల ప్రజాప్రతినిధులు, ప్రపంచ పర్యాటక రంగ ప్రముఖులను ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు
