Site icon NTV Telugu

Kishan Reddy: తెలంగాణలో మజ్లిస్ జండా ఎగురేయాలని అనుకుంటుంది.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్

Kishan

Kishan

Kishan Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు జరిగిన బీజేపీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రజాకార్లు, మజ్లిస్ పార్టీ ఎలాంటి దుర్మార్గాలు చేశారో అందరికీ తెలుసునని, అలాంటి దుర్మార్గాలు చేసి ప్రజల రక్తం తాగిన మజ్లిస్ పార్టీ కి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లు జి హుజూర్ అంటూ సలాం కొడుతున్నాయని అన్నారు. ఈ సంగతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించిందని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు. మజ్లిస్ పార్టీ మో చేతి నీళ్ళు తాగుతూ బీజేపీనీ విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీ, కెసిఆర్ కు ఉందా? అంటూ ప్రశ్నించారు.

ఈ సందర్బంగా ఆయన మజ్లిస్ పార్టీపై ఆయన మండిపడ్డారు. మత రాజకీయాలు చేస్తున్నవారిపై విమర్శలు గుప్పిస్తూ, మమ్మల్ని మతోన్మాదులు అంటున్నారు కానీ.. మేము రజాకార్ల వారసులపై పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ ఇప్పుడేం ఓల్డ్ సిటీకి మాత్రమే పరిమితం కాలేదని, తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తూ కుట్రలు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. అలాగే, మజ్లిస్ పార్టీకి ఎజెంట్లుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ మూడు పార్టీలు బీజేపీ విషయంలో ఒకే విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ ఒకే తానే ముక్కలు అని విమర్శించారు. మజ్లిస్ పార్టీ లక్ష్యం రేపు తెలంగాణలో జండా ఎగురేయాలని ఉందని, దీనికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సహకరిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

హిందువులు ఏమైనా పర్వాలేదు కానీ బీజేపీ అధికారంలోకి రాకూడదనేది ఈ పార్టీల దృష్టికోణం అని, బీజేపీని అణచివేయడానికి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. నిజాం పాలనలో రజాకార్లు చేసిన దౌర్జన్యాలను గుర్తు చేస్తూ, అలాంటి పరిస్థితులు మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీజేపీని ఓడించాలనే కుట్ర జరుగుతోందని, జాతీయ భావజాలాన్ని తొక్కి పెట్టాలని, బీజేపీని అణచివేయాలని చూస్తున్నాయి ఈ మూడు పార్టీలు అంటూ ఫైర్ అయ్యారు. కానీ, ప్రజలు ఈ కుట్రలను తిప్పికొడతారని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version