NTV Telugu Site icon

Kishan Reddy: భిన్నకళలు, సంస్కృతిని కాపాడుకుందాం

Kishan 1 (1)

Kishan 1 (1)

మన భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి ఇతర దేశాలను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపమైన భారతదేశంలోని భిన్న కళలను, సంస్కృతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపట్టిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.వందేభారతం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన జోనల్ స్థాయి నృత్య పోటీలను కేంద్ర మంత్రి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో వివిధ నృత్యరూపకాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.

దేశంలోని రాష్ట్రాలను వివిధ జోన్లుగా విభజించి.. 17-30 ఏళ్లలోపు యువతీ, యువకులతో జానపద కళారూపాలు, గిరిజన నృత్యరూపకాలు, శాస్త్రీయ నృత్యం, సమకాలీన కళారూపాలతో భారత సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన కళాకారులను కిషన్ రెడ్డి అభినందించారు.

గ్రామీణ యువతలో అద్భుతమైన శక్తిసామర్థ్యాలు దాగున్నాయని, వాటిని వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన కళాకారులతో డిసెంబర్ 6వ తేదీన నాగ్ పూర్ లో జోనల్ స్థాయి ఫైనల్స్ ఉంటాయని, డిసెంబర్ 19న ఢిల్లీలో దేశవ్యాప్త ఫైనల్స్ జరుగుతాయన్నారు. ఇందులో అద్భుతమైన ప్రతిభ కనబరిచే దాదాపు 600 మందికి 2023 జనవరి 26న కర్తవ్యపథ్ లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ లో నృత్యరూపకాలను ప్రదర్శించే అవకాశం ఉంటుందన్నారు.

Read Also: Maharashtra: మోర్బీ ఘటన మరవకముందే.. చంద్రపూర్‌లో కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్..

దేశంలో సాంస్కృతిక వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను కిషన్ రెడ్డి ప్రస్తావించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులు, వారి త్యాగాలను, ప్రపంచానికి పరిచయం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రీయ సాంస్కృతిక్ మహోత్సవ్ పేరుతో.. ఏటా రెండు మూడు ప్రాంతాల్లో సంస్కృతిని ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపడుతున్నామని, తాజాగా కాశి-తమిళ్ సంగం కార్యక్రమాన్ని వారణాసిలో ప్రారంభించుకున్న విషయాన్నీ ఆయన ప్రస్తావించారు.

ఒక ప్రాంతంలోని సంస్కృతి, సంప్రదాయాలను ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శించడం ద్వారా ఇరు ప్రాంతాల వారికి ఆయా ప్రాంతాల్లోని సంస్కృతులపై అవగాహన కలుగుతుందని.. ఒకరి గురించి మరోకరు తెలుసుకోవడం ద్వారా సౌభ్రాతృత్వ వాతావరణం దేశవ్యాప్తంగా ఏర్పడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’ లక్ష్యం పూర్తయేందుకు ఇది బాటలు వేస్తుందన్నారు. డిసెంబర్ 1 నుంచి ‘జీ-20’ సమావేశాలకు భారతదేశం నేతృత్వం వహిస్తున్న విషయాన్ని గుర్తుచేసిన కిషన్ రెడ్డి, వచ్చే ఏడాదిపాటు దేశవ్యాప్తంగా 55 నగరాల్లో జరిగే 250కి పైగా సమావేశాల్లోనూ భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామని, వారిని ఆయా సమావేశ కేంద్రాల చుట్టుపక్కలనున్న పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ రామకృష్ణ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డైరెక్టర్ మేజర్ రామ్ కుమార్ తోపాటు 4 రాష్ట్రాలకు చెందిన దాదాపు 200 మంది కళాకారులు పాల్గొన్నారు.

Read Also: CM KCR: సృజనాత్మకంగా ఆలోచిస్తేనే ప్రజల ఆదరణ