NTV Telugu Site icon

Kishan Reddy : సాలార్‌జంగ్ మ్యూజియం 72 ఏళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటూనే ఉంది

salarjung museum

salarjung museum

చారిత్రక సాలార్‌జంగ్ మ్యూజియంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కొత్తగా నిర్మించిన రెండు అధునాతన బ్లాక్‌లను కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ ని సందర్శించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. 1951 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మకమైన సాలార్‌జంగ్ మ్యూజియం.. రోజురోజుకూ కొత్త కళాకృతులు, దేశ, విదేశాల చిత్రాలను ప్రదర్శిస్తూ.. 72 ఏళ్లుగా సందర్శకులను ఆకట్టుకుంటూనే ఉందన్నారు. పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటుండటం హర్షదాయకమన్నారు. ఇవాళ కూడా ఈ ప్రతిష్టాత్మక మ్యూజియం మరో రెండు బ్లాకులను మీ సమక్షంలో ప్రారంభించుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఏ దేశానికైనా, జాతికైనా తన అస్తిత్వం కోసం.. దేశ చరిత్రను, సంస్కృతిని, కళలను, సంప్రదాయాలను, భాషను కాపాడుకోవడం చాలా అవసరమన్నారు.

అంతేకాకుండా.. ‘ అందుకే.. సంస్కృతిని, సంప్రదాయాన్ని మనం పాటించడం ద్వారా అస్తిత్వాన్ని నిలుపుకుంటాం. నిత్యం మాట్లాడటం ద్వారా మన భాషను కాపాడుకుంటాం. అలాగే మన కళలను కాపాడుకోవడం, కళాకృతులను సంరక్షించుకోవడం కూడా కీలకమైన బాధ్యతే. మ్యూజియమ్స్ ద్వారా ఇలాంటి కళావస్తువుల సంరక్షణ, భవిష్యత్ తరాలకు వీటిని అదించే ప్రయత్నం జరుగుతోంది. సాలార్‌జంగ్ మ్యూజియం.. 2000వ సంవత్సరంలో రెండు కొత్త బ్లాక్స్ నిర్మిస్తే.. ఇవాళ మరో రెండు బ్లాక్స్ అందుబాటులోకి వచ్చాయి. పురాతన వస్తువులు, కళాకృతులను జాగ్రత్తపరిచి వాటిని సందర్శకులకు చూపించడం ఒక్కటే కాదు.. మన సాలర్‌జంగ్ మ్యూజియానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో.. టెంపరేచర్, లైటింగ్, హ్యుమిడిటీ ఉండేలా వివిధ దేశాల కళావస్తువులను ప్రిజర్వ్ చేస్తున్న సదుపాయం కూడా ఇక్కడ ఉంది.

2వ శతాబ్దం నాటి బోధిసత్వ మైత్రేయ చిత్రం మొదలుకుని.. 3వ శతాబ్దంలోని ఇక్ష్వాకుల కాలంనాటి నిలబడిన బుద్ధ విగ్రహం కూడా ఈ మ్యూజియంలో ఉంది. ఇది ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బయటపడింది. ఇలా ఎంతో విలువైన చారిత్రక సంపద కలిగిన ఈ మ్యూజియంను మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో నరేంద్రమోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది.

సాలర్‌జంగ్ మ్యూజియంలో ఇవాళ ప్రారంభించుకున్న ఇండియన్ స్కల్ప్-చర్ (sulpture) గ్యాలరీ ఆధునీకరణకు రూ. 32 లక్షలు,
బిద్రీవేర్ గ్యాలరీ ఆధునీకరణకు రూ.38 లక్షలు, ల్యాంప్స్ గ్యాలరీ కోసం రూ.35 లక్షలు, యురోపియన్ బ్రాంజ్ స్టాచువరీ గ్యాలరీ కోసం.. రూ.28 లక్షలు, యురోపియన్ మార్బల్ గ్యాలరీ కోసం రూ.42 లక్షలు కేంద్రం మంజూరు చేసింది.

ప్రధానమంత్రి పాంచ్ ప్రణ్ లో పేర్కొన్నట్లుగా.. మన సంస్కృతి, వారసత్వం పట్ల మనందరం గర్వపడాలి. మనదేశ వారసత్వ, ఆధ్యాత్మిక, చారిత్రక సంపద వివిధ సందర్భాల్లో ఇక్కడినుంచి అక్రమంగా విదేశాలకు తరలించబడింది. దీన్ని తిరిగి మన దేశానికి తీసుకొచ్చేందుకు మోడీ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి.. 2014వరకు ఇలా విదేశాలనుంచి కేవలం 13 కళావస్తువలు మాత్రమే మన దేశానికి తిరిగి తీసుకురాబడ్డాయి.

కానీ మోడీ గారి చొరవ కారణంగా.. గత పదేళ్లలో.. 344 భారతీయ కళాకృతులు మన దేశానికి తిరిగి తెచ్చుకోగలిగాం. ప్రధానమంత్రి ఏ దేశంలో పర్యటించినా.. అక్కడున్న భారతీయ కళాకృతుల విషయంలో ఆయా దేశాల అధినేతలతో చర్చిస్తారు. దీంతోపాటుగా భారత పర్యాటకానికి వారు బ్రాండ్ అంబాసిడర్. అక్టోబర్ 2023 వరకు 73 లక్షలమంది విదేశీ పర్యాటకులు మన దేశాన్ని సందర్శించారు.

2022తో పోలిస్తే ఇది 56% ఎక్కువ. విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు, మన పర్యాటక కేంద్రాల సంపూర్ణ వివరాలను అందించేందుకు.. కేంద్ర పర్యాటక శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త చొరవతో.. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, UK, USA వంటి దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లో.. ప్రత్యేకంగా టూరిజం ఆఫీసర్లను నియమించాం. మన వీసా విధానాన్ని సరళీకృతం చేసి.. 167 దేశాలనుంచి వచ్చే వారికి ఈ-వీసా సదుపాయాన్ని కల్పించాం. స్వదేశీ దర్శన్ కింద రూ.5,294 కోట్లతో 76 ప్రాజెక్టులు.. ప్రసాద్ పథకంలో.. రూ.1,630 కోట్లతో 46 ప్రాజెక్టులు.. బుద్ధిస్ట్, రామాయణ్, కృష్ణ సర్క్యూట్లను ఏర్పాటుచేశాం. అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు ప్రాంతంలో ‘పరశురామ్ కుండ్’ను అభివృద్ధి చేస్తున్నాం. పశ్చిమాన సోమనాథ్ ఆలయంలో సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. కేదారనాథ్ లో ఆది శంకరాచార్యుల సమాధిని ఆధునీకరించుకున్నాం. 40 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథ్ ధామ్ ను ఆధునీకరించుకున్నాం. 550 ఏళ్ల తర్వాత అయోధ్యలో అద్భుతమైన రామమందిర నిర్మాణం జరుగుతోంది.

రేపు ప్రాణప్రతిష్ఠ కూడా జరగనుంది. మిత్రులారా, మనం తర్వాతి తరాలకు అందించే.. విలువలు, కళలు, సంస్కృతే నాగరికత అవుతుంది. అందుకే తెలంగాణలోనూ.. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్కృతిని పరిరక్షించేందుకు మేం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నాం. వరంగల్ జిల్లాలో.. కాకతీయులు నిర్మించిన రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో మోడీ చొరవతీసుకున్నారు. అనేక దశాబ్దాల తర్వాత వెయ్యి స్తంభాల గుడిని పునరుద్ధరిస్తున్నాం భద్రాచంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద భక్తులకోసం ఏర్పాట్లు చేశాం. శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని భవిష్యత్ తరాలకోసం సంరక్షిస్తున్నాం. బోనాలు, బతుకమ్మలను జాతీయ స్థాయిలో జరుపుతున్నాం. గిరిజనుల కుంభమేళా అయిన.. సమ్మక్క-సారలమ్మ జాతరకు అన్నిరకాలుగా మద్దతును తెలియజేస్తున్నాం. ఇలా.. మన ప్రాంత, మన దేశ సాంస్కృతిక విలువలను, కళాకృతులను పరిరక్షించడంలో.. ఇక్కడున్న కొందరు ఎంతో కృషిచేస్తున్నారు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.