Kishan Reddy: హైదరాబాద్ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్రమంత్రి అనేక విషయాలపై మాట్లాడారు. ఈ సందరబంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం అంటేనే సాంకేతికతో సంప్రదాయం, శాస్త్ర పరిజ్ఞానంతో ఆధ్యాత్మికత, వారసత్వ సంపదతో సృజనాత్మకత కలగలిసి ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన 2014లోనే మార్పు, పారదర్శకత నినాదంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా భారత్ అవతరించింది. పేదరిక నిర్మూలన, డిజిటల్ సాధికారత, వడివడిగా మౌలికవసతుల కల్పన, రైతుల సంక్షేమం, స్టార్టప్స్ కు ప్రోత్సాహం ఇలా అన్ని రంగాల్లో మున్ముందుకు సాగిపోతోంది. హైదరాబాద్ కేవలం ఓ రాష్ట్రానికి రాజధాని నగరం కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం లాంటిదని ఆయన అన్నారు.
ఐటీ హబ్‌గా, ఇన్నొవేషన్ కారిడార్‌గా, ఫార్మాసూటికల్ క్యాపిటల్‌గా, ఏరోస్పేస్ టెక్నాలజీ సెంటర్‌గా వర్ధిల్లుతోంది. ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని మరింత పెంచేందుకు అందరమూ కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. 2047 నాటికి మన దేశం వికసిత భారత్‌గా వెలుగొందాలని తరచూ ప్రధాని మోదీ పిలుపునిస్తూ ఉంటారు. అయితే రాష్ట్రాల కీలక సహకారంతోనే ఈ కల సాకారమవుతుందని ఆయన అన్నారు. పరిశ్రమలను, స్టార్టప్స్ ను, టాలెంట్ ను, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలి. రాష్ట్రాల మధ్య సుహృద్భావ పోటీతోనే ప్రమాణాలు పెరగడంతో పాటు సంస్కరణలకు వీలు కలుగుతుందని.. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని ఈ సందర్బంగా ఆయన తెలియచేశారు.
CM Revanth: తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్.. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యం..!
2014 నుంచి 25 వరకు 748.78 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు దశాబ్దంతో పోలిస్తే ఏకంగా 143 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి రహిత పాలన పెరిగింది. దీంతో పెట్టబడిదారుల్లో నమ్మకం పెరిగింది. భారత్‌ను పెట్టుబడులకు సురక్షితమైన దేశంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’, ‘మేకిన్ ఇండియా’ ద్వారా భారత్ మొబైల్ ఫోన్ల తయారీ రంగంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా అవతరించింది. 2014లో రెండు యూనిట్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 300 యూనిట్లకు పెరిగింది. రక్షణ రంగం ఎగుమతులు 2013-14లో రూ.686 కోట్లు ఉండగా, ఇప్పుడు 34 రెట్లు పెరిగి ఏకంగా రూ.23,622 కోట్లకు ఎగబాకాయి. ఆపరేషనల్ ఎయిర్ పోర్టులు 2014లో 74 ఉండగా, ఇప్పుడు అది రెట్టింపై 160కి పెరిగాయి. రైల్వే క్యాపిటల్ పెట్టుబడులు, మెట్రో నెట్ వర్క్ భారీగా పెరిగాయి. గత పదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. గ్లోబల్ నార్త్, గ్లోబల్ సౌత్ కు మధ్య వారధిగా, పెద్దన్న పాత్ర పోషిస్తోందని వివరించారు.
2014 నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పన్నుల, గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిక పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల రూపంలో రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులను అందించింది. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.1.5 లక్షల కోట్లు కేటాయించి, కారిడార్లు, రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారులు, ఎకనామిక్ కారిడార్లను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందన్నారు. రైల్వే కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు, ఎలక్ట్రిఫికేషన్, సిగ్నలింగ్ వంటి పనుల కోసం రూ.32 వేల కోట్లు కేటాయించింది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలో రూ.2,500 కోట్లతో 42 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్వే మానుఫ్యాక్చరింగ్ యూనిట్ తొలి దశ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రామగుండంలో రూ.11 వేల కోట్లతో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల కొత్త థర్మల్ పవర్ ప్లాంటు నిర్మించాం. మరో 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించేందుకు ఎన్టీపీసీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి
వరంగల్ లో పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్కు ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. రూ.2300 కోట్లతో జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ను అభివృద్ధి చేస్తున్నాం. ఎయిమ్స్ బీబీనగర్, ఐఐటీ హైదరాబాద్, డీఆర్ డీవో, హెచ్ఏఎల్, బీడీఎల్, మిదాని వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణను దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుతం దేశంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఉంది. త్వరలోనే మూడో స్థానానికి ఎగబాకుతుందనడంలో సందేహం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఈ సదస్సు ద్వారా తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నానని ముగించారు.
