Union Minister Kishan Reddy Explained about Azad Ki Amrut Mahotsav.
భారతదేశం 75వ స్వాంతత్ర్య దినోత్సవ వేడుకలు సిద్ధమవుతోంది. 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అజాది కా అమృత్ మహోత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోంది. అయితే ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అజాది కా అమృత్ మహోత్సవాల్లో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిన్న అజాదికా అమృత్ మహోత్సవ కమిటీ సమావేశం మోడీ అధ్యక్షతన జరిగిందని, ఈ నెల 11వ తేదీన విభజన దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. విభజన సందర్భంగా లక్షల మంది పొట్ట చేత బట్టుకొని ఒక దేశం నుంచి మరో దేశానికి వచ్చారని, పార్లమెంట్‌లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఆగస్ట్ 15 దేశ చరిత్రలో మరుపురాని రోజని, దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. 95శాతం పొలిటికల్ పార్టీలు అజాది కా అమృత్ మహోత్సవాలను స్వాగతిస్తున్నారని, 20 కోట్ల ఇళ్లపై జెండాలు ఎగురవేసే అవకాశం ఉందన్నారు. జాతీయ జెండాల కొరత ఉందని, జెండాలు అందుబాటులో లేకపోతే, తెల్ల కాగితంపై జెండాను ముద్రించి గోడలపై అంటించాలన్నారు. ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ అందరూ జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు.
