NTV Telugu Site icon

Kishan Reddy : రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తెలంగాణ విద్యావ్యవస్థకు శాపంగా మారింది

G. Kishanreddy

G. Kishanreddy

రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తెలంగాణ విద్యావ్యవస్థకు శాపంగా మారిందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తాజాగా ప్రకటించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ లో రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్య సంస్థల పనితీరు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఉన్నత విద్యలో మాత్రమే కాదు, ప్రాథమిక విద్యలోనూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు నానాటికి తీసికట్టుగా ఉందని ఇటీవల విడుదల చేసిన ఉమ్మడి జిల్లాల విద్య సమాచార వ్యవస్థ సర్వే నివేదిక స్పష్టం చేస్తోందని, ఈ పాపంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన పాత్ర ఎంత ఉందో, గత డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమూ అంతే ఉందన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకే పట్టం కడుతూ పరస్పర నిందారోపణలు చేసుకొంటూ కాలం వెళ్లదీస్తున్న ఈ రెండు పార్టీలూ రాష్ట్ర విద్య వ్యవస్థను దిగజార్చుతూ తెలంగాణ బిడ్డల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నాయన్నారు.

అంతేకాకుండా..’నిన్న ప్రకటించిన ప్రకటించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ఓవరాల్ విభాగంలో మన ఉస్మానియా యూనివర్సిటీ 70వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఇదే విభాగం గతేడాది 2023లో 64వ ర్యాంకు, అంతకుముందు 2022లో 46 వ ర్యాంకులో నిలిచింది. ర్యాంకింగ్ ను మెరుగుపర్చుకోవడం అటుంచితే, ఉన్న స్థానాన్ని నిలబెట్టుకోవడంలోనూ విఫలమై మన యూనివర్సిటీలు దిగజారుతున్నాయి. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితే ఇలా దిగజారుతుంటే ఇతర యూనివర్సిటీల సంగతి చెప్పాల్సిన పనే లేదు. కళాశాల విభాగంలో టాప్ 100లో తెలంగాణ నుంచి ఒక్క కాలేజీకీ స్థానం దక్కలేదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఐఐటీ హైదరాబాద్, హెచ్సీయూ, నైపర్, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ మెరుగైన పనితీరు కనబరుస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విద్యాసంస్థలు దిగజారుతున్నాయంటే లోపం ఎక్కడుందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

యూనివర్సిటీల్లో 2400 ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. ఉస్మానియాలో 1268 పోస్టులకు 848 ఖాళీలు, కాకతీయలో 403 పోస్టులకు 293 ఖాళీలు ఉన్నాయి. ఇతర యూనివర్సిటీల సంగతి సరేసరి. ప్రభుత్వ యూనివర్సిటీలకు విడుదల చేస్తున్న నిధులు సిబ్బంది వేతనాలకే సరిపోతున్నాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు నిధులు అందడం లేదు. ఫలితంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు పూర్తిగా అటకెక్కాయి. అవసరమైన అధ్యాపకులు, తగిన సిబ్బంది ఉండి, పరిశోధనలు నిర్వహిస్తేనే విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చెందుతాయి. ఏళ్లకు ఏళ్లు ఖాళీలను భర్తీ చేయకుండా, పరిశోధనల చేపట్టకుండా యూనివర్సిటీల విద్య ప్రమాణాలు ఎలా మెరుగుపడుతాయి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం యూనివర్సిటీ వీసీలను నియమించేందుకు మీనమేషాలు లెక్కించి చేసిన జాప్యం అంతాఇంతా కాదు. మే నాటికి అన్ని యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇంతవరకు ఆ దిశగా చేసిందేమీ లేదు. ఇంచార్జీ వీసీలతోనే యూనివర్సిటీలను నెట్టుకొస్తున్నారు. ఇక ఫీజు రీఎంబర్స్ మెంట్, స్కాలర్షిప్పుల బకాయిలు సైతం పేరుకుపోతున్నాయి. ఈ బకాయిలు చెల్లించడానికి రూ.7519 కోట్ల నిధులు కావాలి. ఈ నిధులు విడుదల చేయడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఖరి దొందూదొందే. తెలంగాణ ఉద్యమంలో విశ్వవిద్యాలయాలు

Srisailam Dam : చేపల కోసం శ్రీశైలం డ్యాం దగ్గర పెద్దఎత్తున మత్స్యకారులు

చురుకైన పాత్ర పోషించాయి. స్వరాష్ట్రం ఏర్పడితే విద్య ప్రమాణాలు మెరుగుపడుతాయని, మెరుగైన విద్య వసతులతో భవిష్యత్ తరాలు బాగుపడుతాయని ఆశించారు. ఏమైతే ఆశించి నాడు యూనివర్సిటీలు ఉద్యమించాయో అందుకు పూర్తి విరుద్ధంగా గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ఉన్నత విద్యపై శీతకన్ను వేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల పరిస్థితయితే మరింత అధ్వానంగా ఉంది. ఉమ్మడి జిల్లాల విద్య సమాచార వ్యవస్థ సర్వే నివేదిక ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఫర్నీచర్ కొరత, అమ్మాయిలకు మరుగుదొడ్డి సదుపాయం, ఇలా అనేక సమస్యలు తిష్ట వేశాయి. ఐటీ క్యాపిటల్ గా చెప్పుకునే తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం లేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలోని 30,014 ప్రభుత్వ పాఠశాలల్లో 25,217 పాఠశాలల్లోనే మంచినీటి వసతి ఉంది. అంటే సుమారు 5000 పాఠశాలల్లో కనీసం తాగునీటి వసతి కూడా లేదు. 14,028 పాఠశాలల్లో అమ్మాయిలకు మరుగుదొడ్డి వసతి లేదు.

Auctioneer Hugh Edmides: ఐపీఎల్ 2025 వేలంలోకి వస్తే.. అతను రూ. 30 కోట్లకు పైగా అమ్ముడుపోతాడు..

టీచర్ల నియామకం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 24వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా పెట్టారంటే పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలపై వీరికున్న ప్రేమేంటో అర్థమవుతోంది. 6800 ప్రభుత్వ పాఠశాలలు ఒకే ఒక్క టీచర్ తో నడుస్తున్నాయి. టీచర్లు లేకుంటే పాఠాలు చెప్పేదెవరు? అందుకే రాష్ట్రంలో ప్రాథమిక విద్యలో ప్రమాణాలు సైతం దిగజారుతున్నాయి. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 ప్రకారం రాష్ట్ర సగటు ప్రదర్శన (36.7 శాతం) జాతీయ సగటు (37.8 శాతం) కన్నా తక్కువగా ఉండడం రాష్ట్రంలో దిగజారుతున్న విద్య ప్రమాణాలకు అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 29లక్షల విద్యార్థులు ఉంటే, ప్రభుత్వ పాఠశాలల్లో మూడో వంతు ఉన్న 10వేల ప్రైవేటు పాఠశాలల్లో 30 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. వేలు, లక్షల్లో ఫీజులు కట్టి తల్లితండ్రులు ప్రైవేటు స్కూళ్లలోనే తమ పిల్లలను చేర్పిస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పేరిట ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ నియామకాలు చేస్తామన్నారు, నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతి, నిరుద్యోగ నిర్మూలన, ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు వంటి హామీలెన్నో గుప్పించారు. గద్దెనెక్కాక అవన్నీ మరచిపోయారు. నేటి పోటీ యుగంలో మెరుగైన విద్య ఉంటేనే ఎవరైనా అవకాశాలు అందుకుంటారు. మన తెలంగాణ బిడ్డలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే వారికి నాణ్యమైన విద్య అందించాలి. ఎంత పెద్ద నిర్మాణమైనా పునాది గట్టిగా ఉంటేనే కలకాలం నిలబడుతుంది. అలాంటి పునాది అయిన నాణ్యమైన విద్య విషయంలో నేరమయ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రస్తుత తరానికే కాదు, భవిష్యత్ తరాలకూ తీరని అన్యాయం చేస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలలు, యూనివర్సిటీల్లో ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలి, విద్యార్థులకు వసతులు మెరుగుపర్చాలి, ఫీజు రీఎంబర్స్ మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలి. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరుస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. లేకుంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు.’ అని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.