వెస్టిండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో 14 వేలకు పైగా పరుగులు, మూడు వందల వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2025లో భాగంగా ఈరోజు ఉదయం బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పొలార్డ్ ఈ ఫీట్ అందుకున్నాడు. మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ సాధించాడు.
Also Read: Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం!
టీ20 ఫార్మాట్లో అత్యధిక రన్స్ (14562) చేసిన బ్యాటర్‌గా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. పొట్టి ఫార్మాట్లో అఫ్గనిస్తాన్ స్పిన్ దిగ్గజం రషీద్ ఖాన్ హయ్యస్ట్ వికెట్ టేకర్‌గా (661) కొనసాగుతున్నాడు. అయితే 14 వేల పరుగులు, 300 వికెట్లు తీసింది మాత్రం కీరన్ పొలార్డ్ ఒక్కడే. ఇప్పటి వరకు 712 టీ20 మ్యాచ్‌లు ఆడిన పొలార్డ్.. 332 వికెట్స్, 14 వేల రన్స్ బాదాడు. 2022లోనే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన పొలార్డ్.. సీపీఎల్‌లో మాత్రం ఆడుతున్నాడు. గేల్ కంటే ఇంకా 563 పరుగులు వెనకబడి ఉన్నాడు. మరి గేల్ రికార్డును పొలార్డ్ బద్దలు కొడతాడేమో చూడాలి.
