Kesineni Nani: కేశినేని నాని వరుస పోస్టులు.. రాజకీయ రీఎంట్రీకి సంకేతాలా?

  • మరోసారి హాట్ టాపిక్‌గా మాజీ ఎంపీ కేశినేని నాని
  • రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్న నాని పోస్టులు
  • రాజకీయ రీఎంట్రీకి నాని సంకేతాలా?
Kesineni Nani Political Comeback

Kesineni Nani Political Comeback

Is Kesineni Nani Hints at Political Comeback: విజయవాడ రాజకీయాల్లో మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇటీవల సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా తన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కొనసాగుతున్న రాజకీయ వైరం నేపథ్యంలో.. నాని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది.

కేశినేని నాని సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎక్కువగా కేశినేని చిన్నిని లక్ష్యంగా చేసుకున్నవే కావడం గమనార్హం. ఇద్దరు సోదరుల మధ్య రాజకీయ విభేదాలు రోజురోజుకూ ముదురుతుండగా.. తాజాగా నాని చేసిన ఓ పోస్ట్ కొత్త ఊహాగానాలకు తెరలేపింది. ఇటీవల నాని తన సోషల్ మీడియా ఖాతాలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. అంతేకాకుండా ‘రానున్న రోజుల్లో రోజుకో షాక్ ఇస్తాను’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పోస్ట్ వెనుక రాజకీయ వ్యూహం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

×
×
Ad

వైఎస్ జగన్‌తో ఉన్న ఫొటోను కేశినేని నాని ఉద్దేశపూర్వకంగానే పోస్ట్ చేశారా?.. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ తరఫున రాజకీయంగా చురుకుగా వ్యవహరించేందుకు సంకేతాలు ఇచ్చారా? అనే చర్చ కూడా నెట్టింట జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కేశినేని చిన్నితో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో మరింత బలంగా పోరాడాలంటే ఒక రాజకీయ వేదిక అవసరమనే ఆలోచనతో నాని అడుగులు వేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నాని ఇప్పటివరకు తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయినప్పటికీ.. ఆయన చేస్తున్న వరుస పోస్టులు, జగన్‌తో ఉన్న ఫొటోను పంచుకోవడం, షాకులు ఇస్తాను అనే వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలోనే రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. చూడాలి మరి.. నాని వరుస ట్వీట్స్ ఎక్కడివరకు దారి తీస్తాయో.