Coconut Diet: ఎవరికైనా రోజు ఒకే ఆహారం తింటే బోర్ కొడుతుంది. ఆఖరికి చికెన్ బిర్యాని లాంటివి అయినా సరే కొద్ది రోజులు తినగానే ఇంకా తినాలి అనిపించద్దు. రోజుకొక కొత్త వెరైటీ కావాలి అనిపిస్తూ ఉంటుంది. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా రోజూ వేరు వేరుగా ఉంటేనే తినాలి అనిపిస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం 28 ఏళ్లుగా ఒకే ఆహారాన్ని ప్రతి రోజూ తింటున్నాడు. దీనికి కారణం అతడి అనారోగ్యం. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన బాలకృష్ణ పలాయి అనే వ్యక్తికి గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ) అనే వ్యాధి ఉంది.
దీనితో బాధపడేవారిలో ఉండే ప్రధానమైన సమస్య ఏంటంటే వీరిలో అన్నవాహిక చివర ఉండే కండరం సరిగ్గా మూసుకోదు. దాని కారణంగా ఏం తిన్నా గ్యాస్ వచ్చినట్లు అనిపిస్తుంది. గుండెల్లో మంట, వాంతులు, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీంతో నీరసం వచ్చి ఒక్కసారిగా కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంది. ఈ జబ్బుతో బాధపడే బాలకృష్ణ తన సమస్య పరిష్కారం కోసం ఎంతో మంది వైద్యులను కలిశాడు . కానీ ఎలాంటి ప్రయోజనం లేదని గమనించాడు. అయితే కొన్ని రోజుల తరువాత అతను ఒకసారి కొబ్బరి నీరు తాగాడు. దాని వల్ల అతనికి ఏం ఇబ్బంది అనిపించలేదు. అంతేకాదు కొంతకాలానికి లేత కొబ్బరిని ఆహారంగా తీసుకోవడం ప్రారంభించాడు. దాని వల్ల కూడా ఏం సమస్య రాపోవడంతో ఇంకా పూర్తిగా దానినే తన ఆహారంగా మార్చకున్నాడు. కోకోనట్ డైట్ ప్లాన్ కు మారిపోయాడు. 28 ఏళ్లుగా కేవలం కొబ్బరి నీళ్లు, లేత కొబ్బరి తింటూ బతుకుతున్నాడు. కొబ్బరి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికి తెలిసిందే.
