Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?

Kavya Maran Anirudh Ravichander

Kavya Maran Anirudh Ravichander

Kavya Maran – Anirudh Ravichander Wedding: గత కొంతకాలంగా దక్షిణాది సినీ, వ్యాపార వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన పెళ్లి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

అందిన సమాచారం ప్రకారం.. వీరి వివాహం నవంబర్ 11న గ్రీస్ వేదికగా అత్యంత వైభవంగా జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఈ వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది. ఈ విషయంపై ఇరు కుటుంబాల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరి మారన్ హైదరాబాద్‌కు వచ్చి పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి, నవంబర్ 21న చెన్నైలో జరగనున్న కావ్య మారన్ – అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాల్సిందిగా రేవంత్ దంపతులను ఆత్మీయంగా ఆహ్వానించారు.

ఆపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసానికి చేరుకుని, కేటీఆర్ ఆయన సతీమణి శైలిమను కలిసి వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ నూతన వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ తాజా ఆహ్వానాలతో కావ్య మారన్ వివాహ రిసెప్షన్ తేదీపై స్పష్టత వచ్చింది. నవంబర్ 21న చెన్నైలో జరగబోయే ఈ విందుకు తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ సహా సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు కళానిధి మారన్ స్వయంగా ఆహ్వానాలు అందించనున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే మారన్ కుటుంబం నుంచి వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.