Site icon NTV Telugu

Karun Nair: తొలి టెస్టులో డకౌట్‌.. అయినా కరుణ్ నాయర్ వరల్డ్ రికార్డు!

Karun Nair

Karun Nair

టీమిండియా బ్యాటర్ కరుణ్ నాయర్ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నాడు. 8 ఏళ్ల 84 రోజుల అనంతరం, 402 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తొలి ఆటగాడిగా రికార్డులో నిలిచాడు. కరుణ్ నాయర్ చివరిసారిగా 2017లో ఆస్ట్రేలియాపై ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఆడాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ ప్లేయర్ రయద్ ఎమ్రిట్‌ను అధిగమించాడు. ఎమ్రిట్‌ 396 మ్యాచ్‌ల (10 ఏళ్ల 337 రోజులు) తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జో డెన్లీ (8 ఏళ్ల 294 రోజులు) 384 మ్యాచ్‌లు, శ్రీలంక ఆటగాడు మహేళ ఉదవట్టే (8 ఏళ్ల 52 రోజులు) 374 మ్యాచ్‌ల అనంతరం రీఎంట్రీ ఇచ్చారు.

2016లో జింబాబ్వేతో జరిగిన వన్డేలో కరుణ్ నాయర్ భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. 2017లో ఆస్ట్రేలియాపై మూడు టెస్టులు ఆడాడు. 2018లో ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైనా.. నాలుగు టెస్టులలో అవకాశం రాలేదు. చివరి మ్యాచ్‌లో అవకాశం ఉన్నా.. హనుమ విహారిని ఆడించారు. ఆపై నాయర్ ఒక్క మ్యాచ్ కూడా భారత్ తరఫున ఆడలేదు. ఈ ఎనమిది ఏళ్లలో భారత్ మూడు ఫార్మాట్లలో కలిపి 402 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 77 టెస్ట్‌లు, 159 వన్డేలు, 166 టీ20లు ఉన్నాయి.

ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటడం, దిగజాల రిటైర్మెంట్ కారణంగా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు కరుణ్ నాయర్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌తో బరిలోకి దిగాడు. దాంతో 402 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 8 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన నాయర్.. డకౌట్ అవ్వడం విశేషం. అయితే టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసిన రికార్డు అతడి పేరుపై ఉంది. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ బాదాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన భారత బ్యాటర్ నాయరే. ట్రిపుల్ సెంచరీ తర్వాత విఫలమవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. నాయర్ ఇప్పటివరకు 7 టెస్టులు, 2 వన్డేలు ఆడాడు.

Exit mobile version