Karumuri Nageswara Rao Fires on Jana Sena Workers Over HHVM Rally: జనసేన కార్యకర్తలు 15 నిమిషాలు రణరంగం సృష్టించారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించి దుర్భాషలాడారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఏం తప్పు చేశారని, ఆయన బొమ్మపై కాలుతో ఎందుకు తన్నారని ప్రశ్నించారు. తమ పార్టీ మీద, తన మీద ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతా? అని మాజీ మంత్రి కారుమూరి అడిగారు.
హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బుధవారం జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అదే మార్గంలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళ్లిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కాన్వాయిని జనసేన కార్యకర్తలు చుట్టుముట్టారు. ప్రచార రథంపై ఎక్కి జనసేన జెండాలు ఊపుతూ చాలా సమయం వీరంగం సృష్టించారు. జనసేన కార్యకర్తలు ప్రచార రథాన్ని ధ్వంసం చేశారు. అయితే ప్రచార రథం వెనుక కారులో కారుమూరి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ ఘటనపై కారుమూరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో మీడియా సమావేశంలో కారుమూరి స్పదించారు.
‘నిన్న జనసేన కార్యకర్తలు 15 నిమిషాలు రణరంగం సృష్టించారు. ఇది దుర్మార్గమైన, హేయమైన పని. కారును అడ్డగించడంతో పాటు జండాలు ఊపుతూ బీభత్సం సృష్టించి దుర్భాషలాడారు. రాష్ట్రంలో ఎంతో మంది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. ఈ తరహా బీభత్సకాండ ఎక్కడా లేదు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఏం తప్పు చేశారు, ఆయన బొమ్మపై కాలుతో తన్నారు. నాకు ఓటు వేయని వారికి సైతం సంక్షేమ పథకాలు ఇవ్వమన్న నాయకుడు జగన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పార్టీలో షోకాజ్ నోటీసు ఇవ్వకుండానే వారి నాయకులను సస్పెండ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ఉన్న స్వేచ్ఛ మాకు లేదని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బాహాటంగానే చెబుతున్నారు. 15 సంవత్సరాలు టీడీపీ పల్లకి మోస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలని లేదు. మా పార్టీ మీద, నా మీద ఇలాంటి దాడులు చేయడం మంచి పద్ధతా? అని అడుగుతున్నా?. నిన్న జరిగిన సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాము’ అని కారుమూరి చెప్పారు.
