Site icon NTV Telugu

Karnataka CM : కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ

Karnataka

Karnataka

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం ఎంపిక నిర్ణయం అధిష్ఠానానికి అప్పగిస్తూ సీఎల్‌పీ తీర్మానం చేయడంతో పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలో సీఎం రేసులో ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక డీకే శివకుమార్‌ ఢిల్లీ టూర్‌ను చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా యూటర్న్‌ తీసుకున్నారు. కడుపు నొప్పి వల్ల ఢిల్లీకి రావడం లేదన్నారు. అలాగే సీఎం పదవి చేపట్టనున్న సిద్ధరామయ్యను డీకే శివకుమార్‌ అభినందించారు. ఆయనకు (సిద్ధరామయ్యకు) అభినందనలు, గుడ్‌ లక్‌’ అని చెప్పారు.

Also Read : GT vs SRH: ముగిసిన గుజరాత్ బ్యాటింగ్.. సన్‌రైజర్స్ లక్ష్యం ఎంతంటే?

ఈ పరిస్థితులు ఇలా ఉంటే కర్ణాటక సీఎం పీఠం విషయంలో పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ పార్టీ హైకమాండ్‌కు మరోసారి గట్టి సంకేతాలు పంపించారు. ఒంటరిగానే 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించానని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో నాకంటూ ఓ వర్గం లేదు.. ఎమ్మెల్యేలంతా నా వాళ్లే.. ఒంటరిగానే కాంగ్రెస్‌కు 135 సీట్లు తెచ్చిపెట్టా.. పైగా కాంగ్రెస్‌ చీఫ్‌(మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి..) నావైపే ఉన్నారు. నా బలాన్ని ఎవరూ లాక్కోలేరు అని డీకే అన్నాడు.

Also Read : Mamata Banerjee : లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తోనే…

అలాగే.. ఇతరుల బలంపై నేను మాట్లాడను.. అవసరమైతే నిరసన తెలుపుతా అంటూ డీకే శివ కుమార్ పేర్కొన్నారు. గతంలో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిచినా ధైర్యం కోల్పోకుండా పార్టీని తిరిగి బలోపేతం చేశానన్నారు. అయితే సీఎం పదవి విషయంలో పార్టీ హైకమాండ్‌ తగిన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను అని డీకే అన్నారు. తిరుగుబాటు చేస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నేనేం తిరుగుబాటు చేయను.. అలాగే బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడను.. తానేం బచ్చాగాడ్ని కాదు.. నాకంటూ ఓ విజన్‌ ఉంది అని డీకే శివ కుమార్ అన్నారు.

Also Read : Python As Weapon: పెంపుడు పైథాన్‌ను ఆయుధంగా వాడి.. వ్యక్తిపై దాడి

ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతుంది. అయితే సిద్ధరామయ్యను సీఎంగా పార్టీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు టాక్. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను డిప్యూటీ సీఎం చేయడంతో పాటు ఆయనకు పలు కీలక శాఖలు ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు సమాచారం. అలాగే మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య, ఆ తర్వాత మూడేళ్లు డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే డీకే శివ కుమార్ రేపు ( మంగళవారం ) ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version